అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం సహజమే..సోషల్ మీడియా రాకతో అది మరి శృతి మించింది. సోషల్ మీడియా ఉంది కదా అని ఎదుటి వారిపై సమయం సందర్బం లేకుండా దాడి చేస్తే అది ఒక్కోసారి బూమ్ రంగ్ అవుతుంది. మాటలతో మంటలు పుట్టిస్తున్న బీజేపీ టీఆర్ఎస్ మధ్య ఇప్పుడిదే జరిగింది. టీఆర్ఎస్ మొదలు పెట్టిన లేఖల యుద్దం ఆ పార్టీకే ఫినిషింగ్ టచ్ ఇచ్చిందా అన్న దానిపై ఖమ్మం రాజకీయాల్లో ఆసక్తికర చర్చ నడుస్తుంది.
ఖమ్మం జిల్లాలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తన పర్యటనలో మంత్రి అజయ్ ని టార్గెట్ చేసుకుని మాటల తూటలు పేల్చారు. సంజయ్ మాటల దాడి వేడిని తగ్గించేందుకు ఇప్పుడు అధికార టీఆర్ఎస్ పడరాని పాట్లు పడుతుందట..మొన్నటికి మొన్న వ్యాక్సిన్ పేరుతో సంజయ్-అజయ్ మధ్య మాటల తూటలు పేలగా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా రెండు పార్టీల మధ్య వార్ ఓ రేంజ్ లో నడుస్తుంది.
కార్పోరేషన్ ఎన్నికల వేళ ఖమ్మంలో పాగా వేయడానికి బిజెపి పడరాని పాట్లు పడుతుంది. కనీసం పట్టు నిలుపుకునేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తుంది. ఇక ఖమ్మం నగరంలో టిఆర్ఎస్ కు బలమైన క్యాడర్ ఉంది. ప్రతిపక్షాలకు కనీసం లీడ్ చేసే లీడర్ కూడ జిల్లాలో లేరన్నది అధికారపక్ష నేతల మాట. అయినప్పటికి బిజెపి నేతల రాక సందర్బంగా అధికార పార్టీ కాస్త అత్యుత్సహం ప్రదర్శించింది. బండి సంజయ్ పర్యటన టార్గెట్ చేసుకుని అధికార పార్టీ నేతలు ఓ రెండు లేఖలను సోషల్ మీడియాలో వదిలారు. ఆ వదిలిన బాణాలను టార్గెట్ గాచేసుకుని ఇప్పుడు బీజేపీ నేతలు అదే రేంజ్ లో రెచ్చుపోతున్నారు.
వామపక్ష ప్రభావిత జిల్లా అయిన ఖమ్మంలో బిజెపి వైపు మొగ్గు చూపే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. అలాంటిది ఆ పార్టీని టార్గెట్ చేసుకుని టీఆర్ఎస్ కొత్త సమస్యలు కొని తెచ్చుకున్నట్లు కనిపిస్తుంది.గోవధ వద్ద నుంచి బాబ్రి మసీదు కూల్చి వేత వరకు సమాదానాలను చెప్పాలంటూ.. బిజెపి దొంగల ముఠాలను తరిమి కొట్టాలంటూ లేఖలు విడుదల చేశారు. .. ఏడు మండలాలు ఖమ్మం జిల్లా నుంచి విడిపోవడానికి మీరు కారణం కాదా …అజ్ఞానం, అశ్లీలత, అనైక్యతకు విస్తరింప చేసేందుకు నగరానికి కాషాయ మూక వస్తుందని మంత్రికి చెందిన మీడియా గ్రూప్ లో సర్క్యూలేట్ చేశారు.
బీజేపీ నేతలు ఏ అంశంతో ప్రజల్లోకి వెళ్లాలా అని ఆలోచిస్తున్న వేళ మంత్రి అంజయ్ వర్గం చూపిన అత్యుత్సాహం కాషాయ దళానికి కొత్త అస్త్రాన్నిచ్చింది. మంత్రినే టార్గెట్ చేసుకుని వార్ మొదలెట్టిన బీజేపీ రోజుకో రీతిలో సోషల్ మీడియా వేదికగా మంత్రి పై విమర్షల వర్షం కురిపిస్తుంది. బీజేపీ నేతల పర్యటనకు ప్రాధాన్యం ఇవ్వకుండా తమ పని తాము చూసుకుంటే బీజేపీ నేతల పర్యటన ఆ తదనంతర పరిణామాలకు అంత హైప్ వచ్చి ఉండేది కాదన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా..మంత్రి అనుచర వర్గం నుంచి మంత్రి దాక అదే రేంజ్ లో స్పందించడం కూడా లేని హైప్ ని బీజేపీకి జిల్లాలో తీసుకొచ్చినట్లయిందా అన్న చర్చ నడుస్తుంది.