ప్రపంచ సంపన్నుడు ఎలాన్ మాస్క్ ఇటీవలే ట్విట్టర్ లో వాటాదారుడయ్యారు. అయితే ఈ నేపథ్యంలో ట్విట్టర్ కొంటానని.. అందుకు ఒక్కో షేర్ ను 54.20 డాలర్ల చొప్పున చెల్లిస్తానని ప్రకటించారు. దీంతో ట్విట్టర్ బోర్డులో గందరగోళం నెలకొంది. అంతేకాకుండా ట్విట్టర్ లో నూరు శాతం వాటాలు కొనుగోలు చేయడానికి కావాల్సిన నిధులకు ఏర్పాట్లను కూడా ఎలాన్ చేసుకున్నారు.
ట్విట్టర్ కొనుగోలుపై మస్క్ వ్యూహాలు రచిస్తుండడంతో ట్విట్టర్ యాజమాన్యంకు ఏం చేయాలో అర్ధం కావడం లేదు.. దీంతో ఈ సమస్య పరిష్కారానికి నేరుగా ఎలాన్ మస్క్ తో చర్చలు జరపడమే ఉత్తమమని ట్విట్టర్ యాజమాన్యం నిర్ణయించింది. అయితే కంపెనీని ఎలాన్ మస్క్ కు విక్రయించడం సాధ్యమేనా? అన్న అంశాన్ని ట్విట్టర్ బోర్డు పరిశీలిస్తున్నట్టు పేర్కొన్నాయి. చర్చలు ప్రారంభించడం అంటే.. మస్క్ ఆఫర్ ను కంపెనీ ఆమోదిస్తున్నట్టు కాదని ప్రకటించాయి.
ఇదిలా ఉంటే .. స్వేచ్ఛగా మాట్లాడే వేదికగా ట్విట్టర్ ఉండాలని, ఇందుకోసం అది ప్రైవేటు సంస్థగా మారాలన్న అభిప్రాయాన్ని ఎలాన్ మస్క్ ప్రకటించడం తెలిసిందే. తన బిడ్ కు ట్విట్టర్ ఓకే చెప్పకపోతే, తన దగ్గర ప్లాన్ బీ ఉందని కూడా ఆయన గతంలో ప్రకటించారు. దీంతో మంచి డీల్ అవకాశాన్ని కాదనుకోవద్దంటూ కొందరు వాటాదారులు కంపెనీని కోరుతుండడం గమనార్హం.