కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటమి కూడా బెజవాడ టీడీపీ నేతల్లో మార్పు తీసుకువచ్చేల కనబడటం లేదు. ఎన్నికలకు ముందు వర్గపోరుతో సై అంటే సై అన్న తెలుగు తమ్ముళ్లు ఆ తర్వాత కూడా తగ్గడం లేదు. అమరావతి అంశం.. బెజవాడలో స్థాన బలం కలిసి వస్తాయని టీడీపీ నేతలు ఎన్నెన్నో లెక్కలు వేసుకున్నా ఎన్నికల్లో అంచనాలన్ని తారుమారయ్యాయి. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు చూశాకైనా నేతల తీరులో మార్పు రాకపోవడంతో తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు.
బెజవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు టీడీపీకి గట్టి షాక్ ఇచ్చాయి. గత ఎన్నికల్లో 38 డివిజన్లు గెలిచి మేయర్ పీఠం అధిరోహించిన తెలుగుదేశం ఈ ఎన్నికల్లో 14 డివిజన్లకే పరిమితమైంది. పోలింగ్‌కు రెండు రోజుల ముందు ఎంపీ కేశినేని నాని ఓ వర్గంగా, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా,నాగుల్ మీరాలు మరో వర్గంగా విడిపోయి విమర్శలు చేసుకున్నారు. రోడ్డెక్కేశారు. మేయర్ అభ్యర్థిగా బరిలో దిగిన కేశినేని నాని కుమార్తె శ్వేత వెళ్లి రాజీ చేసుకోవాల్సి వచ్చింది. బుద్దా వర్గంతో మాట్లాడి మీడియా ముందుకు వచ్చి కలిసికట్టుగా ఉన్నామని కవర్ చేసుకోవల్సి వచ్చింది.
ఇక చంద్రబాబు ఎన్నికల ప్రచారానికి వచ్చిన సమయంలో ఎంపీ కేశినేని నాని దూరంగా ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు చూశాకైనా నేతల తీరులో మార్పు వచ్చిందా అంటే.. లేదనే చెబుతున్నారు. టీడీపీ ఓటమికి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కారణమని ఆరోపిస్తూ మాజీ కార్పొరేటర్ రామయ్య వర్గం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. ఇదే సమయంలో వీరిద్దరి ఫోన్ సంభాషణ వైరల్ కావడం పరస్పర విమర్షలతో వివాదం కొత్త మలుపు తిరిగింది. దీంతో ఒకరి పై ఒకరు విమర్శలు చేసుకుని ప్రజల్లో టీడీపీని చులకన చేశారని తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు
ఓవైపు అధికార పార్టీ స్థానిక నేతలతోపాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా మంత్రులను రంగంలోకి దించి ఒక్క ఓటు కూడా జారకుండా జాగ్రత్త పడింది. టీడీపీ నేతల వైఖరి వల్ల పార్టీకి పడే ఓట్లు కూడా పడలేదని కేడర్ భావిస్తోంది. ఇప్పుడు కూడా నాయకులు ఎవరికి వారే యమునా తీరు అన్నట్టుగా వ్యవహరించడం పార్టీ పెద్దలకు సైతం మింగుడు పడటం లేదట. బెజవాడలో పార్టీ ఓటమిపై సమీక్ష చేద్దామన్న ఆలోచన కూడా ఏ ఒక్క నేతలో కనిపించడం లేదట.
చంద్రబాబు లేదా పార్టీ పెద్దలు రంగంలోకి దిగి బెజవాడ టీడీపీ నేతలను ఒకచోట కూర్చోబెడితే కానీ ఎవరూ దారికి రాబోరని తెలుగు తమ్ముళ్లు అభిప్రాయపడుతున్నారట.