వ్యవసాయం, అటవి, మత్స్యరంగాల్లో తెలంగాణ సత్తా చాటిందని, ఐదేళ్ల కిందట రూ.95వేలకోట్లు ఉండగా.. ప్రస్తుతం రూ.1.81లక్షల కోట్ల సంపద పెంచడం తెలంగాణ ప్రభుత్వ చర్యలే కారణమని హ్యాండ్‌బుక్‌లో ఆర్‌బీఐ వెల్లడించిందని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. గడిచిన ఐదేళ్ల కాలంలో తెలంగాణ వ్యవసాయం, అటవీ, మత్స్య రంగాల్లో అద్భుతమైన ప్రగతిని సాధించిందని, ఇదే విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తన నివేదికలో వెల్లడించిందని బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. ఆయా రంగాల్లో రాష్ట్రం రూ.1.81లక్షలకోట్ల విలువైన సంపదను సృష్టించిందని, ఈ ఆర్థిక ప్రగతి జాతీయ స్థాయిలో ఓ రికార్డు అని ఆర్‌బీఐ స్పష్టం చేసిందని గుర్తు చేసిన ఆయన.. ఇది తెలంగాణలోని ప్రతి ఒక్కరికీ గర్వకారణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. సీఎం కేసీఆర్ పరిపాలన దక్షతకు ఆర్‌బీఐ నివేదికే నిలువుటద్దమని పేర్కొన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో తెలంగాణ వృద్ధి సాధించలేదంటున్న కళ్లులేని కబోదులకు ఆర్‌బీఐ దిమ్మ తిరిగిపోయే సమాధానం ఇచ్చిందని పేర్కొన్నారు బోయినపల్లి వినోద్‌కుమార్. ఇలాంటి వృద్ధి మరే ఇతర రాష్ట్రాల్లో లేదని, తెలంగాణ ప్రభుత్వ విప్లవాత్మక చర్యలతోనే ఈ మూడురంగాల్లో గణనీయ వృద్ధి సాధ్యమైందని ఆర్బీఐ చెప్పిందని పేర్కొన్నారు బోయినపల్లి వినోద్‌కుమార్.
స్వరాష్ట్రం తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచే తెలంగాణ ప్రభుత్వం ఈ మూడు రంగాల అభివృద్ధిపై దృష్టి పెట్టిందని, అందు కోసం లక్షల కోట్ల నిధులు ఖర్చు చేసిందని, రైతు బంధు ద్వారానే అన్నదాతలకు సుమారు రూ.58వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అందించిన ఫలితమే ఈ ప్రగతి అని పేర్కొన్నారు బోయినపల్లి వినోద్‌కుమార్. వ్యవసాయానికి ఉచితంగా విద్యత్‌ను అందించేందుకు ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వం రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తున్నదన్నారు. ఇప్పటివరకు రూ.353 కోట్లు ఖర్చుచేసి.. రూ.425 కోట్ల చేప పిల్లల్ని ఉచితంగా పంపిణీ చేసిందని, ఆరేళ్లలో రూ.26వేలకోట్ల సంపదను సృష్టించగలిగిందని వినోద్ కుమార్ పేర్కొన్నారు. రాష్ట్రంలో గ్రీనరీని సాధించేందుకు అడవుల పెంపు, సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని అమలు చేస్తుండడంతో రాష్ట్రంలో అడవుల శాతం భారీగా పెరిగి, రాష్ట్రం ఆకు పచ్చగా మారిందని తెలిపారు బోయినపల్లి వినోద్‌కుమార్.