ఇవాళ సినీ హీరో తారక్ పుట్టిన్రోజు అనగా పండుగ రోజు. ఆయన తనను ఉద్దేశిస్తూ జూనియర్ ఎన్టీఆర్ అని పదే పదే రాయవద్దని చెప్పారు కనుక అలా రాయడం భావ్యం కాదు. పుట్టిన్రోజు సందర్భంగా రాస్తున్న ప్రత్యేక కథనంలో టీడీపీని ఆయన ఏ విధంగా ప్రభావితం చేయనున్నారో అన్నదే కీలకం. ఈ వివరంపై ఓ సారి చర్చిద్దాం. వాస్తవానికి ఎప్పటి నుంచో తారక్ ను ప్రచార నిమిత్తం మళ్లీ మరోసారి తీసుకుని రావాలనే భావిస్తున్నారు. కానీ కొందరు మాత్రం వద్దని వారిస్తున్నారు.
ఆయన వచ్చినా రాకున్నా తెలుగుదేశం గెలుపు అవకాశాలు పెద్దగా మారిపోవు అని ఓ వర్గం వాదిస్తుంటే, మరో వర్గం మాత్రం ఆయన వస్తేనే పార్టీకి పూర్వ ప్రాభవం దక్కుతుందని ఇంకొందరు నందమూరి అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఈ విధంగా చూసుకుంటే ఆయన రాక ఓ అనివార్యం కావొచ్చు.
గతంలో ఓ సారి ఆయన ప్రచారం చేశారు. 2009 ఎన్నికల్లో తారక్ ప్రచారం చేశారు. ప్రచార సందర్భంగా ఆయన ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు కూడా ! ఆ రోజు ఉన్న పరిస్థితుల రీత్యా తారక్ సీన్ లోకి వచ్చారు. కానీ పెద్దగా ఆయన ప్రచారం ప్రభావం ఆ రోజు లేకుండా పోయిందని కొందరు అంటుంటారు. కానీ ఏ మాటకు ఆ మాట జనాలను ఆకర్షించడంలో తారక్ ను మించిన లీడర్ మరొకరు లేరు అని కూడా అంటుంటారు. ఈ విషయంలో బాబాయ్ కు దీటుగా ఇంకా చెప్పాలంటే బాలయ్యకు పోటీగా రావడంతో తారక్ వెనుకంజ వేయరు అని కూడా అంటుంటారు.
నా కట్టె కాలేదాకా నేను తాత స్థాపించిన తెలుగుదేశంలోనే ఉంటానని గతంలో చెప్పిన తారక్.. ఆ మాటకు అనుగుణంగా పార్టీ ఎప్పుడు పిలిచినా ఓ కార్యకర్త మాదిరి పనిచేసేందుకు మాత్రం తనకు ఇష్టమేనని అంటుంటారు తారక్. ఇప్పుడు కష్టకాలంలో టీడీపీ ఉంది కనుక ఈ ఎన్నికల్లో తారక్ ప్రచారం చేస్తారా .. చేస్తే ఎన్ని రోజుల పాటు ఏయే ప్రాంతాలలో చేస్తారు అన్న విషయాలపై తీవ్ర చర్చ నడుస్తున్న తరుణాన తారక్ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో అన్న ఓ ఆసక్తిదాయక చర్చ మరోవైపు నడుస్తోంది.