2029 సార్వత్రిక ఎన్నికల నాటికి మహిళా బిల్లు అమలులోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో రాష్ట్రంలో ఏయే నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారని నేతలు ఆరా తీయడం ప్రారంభించారు. మహిళలకు శుభవార్త. నేరుగా చట్టసభల్లో అడుగుపెట్టే అరుదైన చాన్స్ వారు దక్కించుకోనున్నారు. ఈ అవకాశాన్ని కల్పించి ప్రధాని మోదీ చరిత్రకెక్కనున్నారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ లోక్సభలో కేంద్ర ప్రభుత్వం మంగళవారం బిల్లును ప్రవేశపెట్టింది. వెంటనే ఈ బిల్లు ఆమోదం పొందే అవకాశం ఉంది. రెండు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తికానున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు రాజకీయ పార్టీలకు కొత్తగా వచ్చే టెన్షన్ ఏమీ లేదు. రానున్న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో అమలయ్యే అవకాశాలు లేవు.
దాదాపు 7 గంటలపాటు ఈ బిల్లుపై సభలో డిస్కషన్స్ జరగగా.. దాదాపు 60 మంది ఎంపీలు మాట్లాడారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై పార్టీలు తమ స్టాండ్‌ను వెల్లడించాయి. బిల్లు అసంపూర్తిగా ఉందని విపక్షాలు విమర్శించగా.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సభలో సమాధానమిచ్చారు. అనంతరం న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు వర్తించదని స్పష్టం చేశారు. 2024 ఎన్నికలు జరిగిన వెంటనే జనాభా లెక్కలు, డీలిమిటేషన్ ప్రక్రియ చేపడతామని తెలిపారు. అనంతరం మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్ సభలో ఓటింగ్ ప్రారంభమైంది. ఓటింగ్ ప్రారంభం కాగానే కాంగ్రెస్ సభ నుండి వాకౌట్ చేసింది.