తిరుపతిలో బీజేపీ ఎత్తుగడలు ఫలిస్తాయా..టీడీపీని టార్గెట్ చేసింది అందుకేనా ?

-

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో నామినేషన్ల ఘట్టం ముగిసిన తర్వాతి రోజు నుంచి బీజేపీ మొదలుపెట్టిన మైండ్ గేమ్ ప్రధాన రాజకీయపార్టీల్లో గుబులు పుట్టిస్తుంది. ఎప్పుడో మాట్లాడిన మాటలను తవ్వి తీసి సరికొత్తగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి ప్రధాన పార్టీలను డిఫెన్స్ లో పడేస్తుంది. తామే ప్రధాన పోటీదారు అని ప్రజల అటెన్షన్‌ తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు బీజేపీ నేతలు. వైసీపీని, టీడీపీని టార్గెట్‌ చేసి ఈ రెండు పార్టీలను తమ విమర్శల చట్రంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

రాజకీయ పార్టీల నేతలు ఇదివరకు సందార్భానుసారం చేసిన వ్యాఖ్యలను తవ్వి తీసి రివర్స్ ఎటాక్ ప్రారంభించింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని పార్లమెంట్ లో టీడీపీనేతలు చేసిన ప్రసంగానికి చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు హోదా అవసరం లేదంటు అసెంబ్లీలో మాట్లాడిన మాటలు జతచేసి జనంలో వదులుతున్నారు. ఇక తిరుపతి టీడీపీ అభ్యర్ది పనబాక లక్ష్మికి కూడా అలాంటి షాకే ఇచ్చింది బీజేపీ. గతంలో కాంగ్రెస్ లో ఉన్నప్పుడు చంద్రబాబు పై పనబాక చేసిన కామెంట్స్ వీడియోనూ ట్వీటర్‌లో పెట్టారు. ఇదంతా ఎన్నికల వ్యూహంలో భాగమే అనుకున్నా బీజేపీ ఎంచుకున్న తీరే రాజకీయ వర్గాలను ఆలోచనలో పడేస్తోంది.

తిరుపతిలో వైసీపీ, టీడీపీ, బీజేపీతోపాటు మరికొందరు బరిలో ఉన్న సంగతి తెలిసిందే. అధికారపార్టీ వైసీపీ తనదైన శైలిలో ప్రచారం చేసుకుంటోంది. ఇక టీడీపీ కూడా లోక్‌సభ నియోజకవర్గాన్ని 70 క్లస్టర్లుగా చేసి 70 మంది నేతలకు ఎన్నికల బాధ్యతలు అప్పగించింది. దాదాపు 65 మంది టీడీపీ నేతలు లోక్‌సభ పరిధిలోనే ఉండి ఎన్నికల వ్యూహ రచన చేస్తున్నారు. బీజేపీ కూడా తమ బలాన్ని బలగాన్ని మోహరించింది. అగ్రనేతలు అక్కడే ఉండి ప్రచారం చేస్తున్నారు. సహజంగానే రేస్‌లో ముందు నిలిచేందుకు పార్టీలు ప్రయత్నిస్తాయి. అందులో భాగంగానే పాత వీడియోలను ఈ విధంగా బీజేపీ బయటకు తీస్తోందన్న చర్చ జరుగుతోంది.

ఎన్నికల్లో ప్రధాన పోటిదారు వైసీపీని మాత్రమే విమర్షిస్తే లాభం లేదనుకున్న బీజేపీ. టీడీపీని ముందుగా టార్గెట్ చేసింది. తామే ప్రధాన ప్రతిపక్షం అనే భావన ప్రజల్లో కల్పించేందుకు టీడీపీని టార్గెట్‌ చేస్తున్నారనే కామెంట్స్‌ పొలిటికల్‌ సర్కిళ్లలో వినిపిస్తున్నాయి. ఏదో ఒకటి చేసి తిరుపతి ఉపఎన్నికలో రాజకీయ అటెన్షన్‌ తమ వైపే ఉండేలా గట్టిగా ప్రయత్నిస్తుంది బీజేపీ. అయితే బీజేపీ విమర్శల పై స్పందిచొద్దని టీడీపీ అధిష్ఠానం పార్టీ నేతలకు సూచించిందట. బీజేపీ ప్రధాన పోటీదారు అనిపించేందుకు మొదలుపెట్టిన ఈ వ్యూహంలో చిక్కుకోవద్దని నేతలకు హితబోధ చేసిందట. అందుకే టీడీపీ మాత్రం వైసీపీ పైనే విమర్షలు గుప్పిస్తుంది. మరి బీజేపీ వ్యూహం ఉపఎన్నికలో ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news