డిజిటల్ కరెన్సీపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా దేశంలో.. డిజిటల్ కరెన్సీ తీసుకొచ్చేందుకు కసరత్తు మొదలుపెట్టింది ఆర్బీఐ. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీకి (సీబీడీసీ) సంబంధించిన కాన్సెప్ట్ నోట్‌ను శుక్రవారం రిలీజ్ చేసింది ఆర్బీఐ. ఆర్బీఐ తీసుకొచ్చే డిజిటల్ కరెన్సీ వినియోగదారులకు అదనపు చెల్లింపు మార్గంగా ఉంటుందని, ఇప్పటికే ఉన్న చెల్లింపు వ్యవస్థల్ని రీప్లేస్ చేయడం లక్ష్యం కాదని ఆర్బీఐ స్పష్టం చేసింది. సాధారణంగా సీబీడీసీల గురించి అవగాహన కల్పించడం, డిజిటల్ రూపాయి ప్రణాళికాబద్ధమైన ఫీచర్స్ తెలపడమే ఈ కాన్సెప్ట్ నోట్ జారీ వెనుక ఉద్దేశమని వివరించింది ఆర్బీఐ.
ఆర్‌బీఐ రూపొందించే డిజిటల్ కరెన్సీకి ఈ రూపీ అని పేరు పెట్టారు. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ ఆర్‌బీఐ ఆధ్వర్యంలో వస్తుంది. డిజిటల్ ఫార్మాట్‌లో స్టోర్ అయి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న కరెన్సీకి e₹ అదనంగా ఉంటుంది. బ్యాంకు నోట్లకు భిన్నంగా ఏమీ ఉండదు. కానీ డిజిటల్‌గా ఉండటం వల్ల సులభంగా, వేగంగా, చౌకగా ఉంటుంది. ఇది ఇతర రకాల డిజిటల్ కరెన్సీకి ఉన్నట్టుగానే లావాదేవీ ప్రయోజనాలు ఉంటాయి. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని పేపర్ ఫార్మాట్‌లోకి మార్చుకోవచ్చు. ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్‌లో కూడా ఉంటుంది. చట్టబద్ధంగా ఎక్కడైనా చెల్లుతుంది.