లోకేష్ పాదయాత్ర చేస్తూ టిడిపిని బలోపేతం చేసే దిశగా వెళుతున్న విషయం తెలిసిందే. అదే సమయంలో ఆయన వైసీపీని గట్టిగా టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. గత టిడిపి హయాంకు ఇప్పుడు వైసీపీ హయాంకు ఉన్న తేడాని వివరిస్తున్నారు. జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అదే క్రమంలో లోకేష్ వ్యూహాత్మకంగా ఏ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తే..అక్కడ ఉండే వైసీపీ ఎమ్మెల్యేని గట్టిగా టార్గెట్ చేస్తున్నారు.
వరుసపెట్టి వారిపై భూ కబ్జా ఆరోపణలు, ఇసుక అక్రమాలు, ఇళ్ల స్థలాల్లో అక్రమాలు అంటూ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. పక్కా ఆధారాలు ఉన్నట్లు సర్వే నెంబర్ల సహ లోకేష్ చెబుతున్నారు. అయితే ఆ మధ్య ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డిపై చేసిన ఆరోపణలు పెద్ద ఎత్తున వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆఖరికి కేతిరెడ్డి కూడా స్పందించి లోకేష్ కు కౌంటర్ ఇచ్చారు. అయితే లోకేష్ ఇలా ఆరోపణలు చేయడం స్థానికంగా ప్రజల్లోకి వెళుతుంది. అప్పటికే ఎమ్మెల్యేలపై స్థానికంగా కొన్ని ఆరోపణలు ఉంటున్నాయి.
ఈ క్రమంలో లోకేష్ వాటిని మరింత బలపడేలా చేస్తున్నారు. తాజాగా ఆయన కర్నూలు సిటీలో పాదయాత్ర చేస్తున్నారు. అక్కడ స్థానిక ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ పై ఆరోపణలు చేశారు. హఫీజ్ ఖాన్ స్దానికంగా ఉన్న పలు స్ధలాల్ని ఆక్రమించుకుంటున్నట్లు లోకేష్ ఆరోపణలు చేశారు. ఇక భూకబ్జాలు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని హఫీజ్ సవాల్ విసిరారు. అలాగే లోకేష్ తో కలిసి పాదయాత్రలో నడుస్తానంటూ సవాల్ విసిరారు.
అయితే ఇలా లోకేష్ కబ్జా ఆరోపణలు చేయడం..వాటిపై ఎమ్మెల్యేలు తీవ్రంగా స్పందించడంతో..అవి ప్రజల్లోకి వెళుతున్నాయి..ఇక లోకేష్ పాదయాత్రని అడ్డుకునేందుకు ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారు. అంటే ఎమ్మెల్యేలు అక్రమాలు బయటపెడుతుంటే..తనని అడ్డుకోవాలని చూస్తున్నారని లోకేష్ ప్రజల్లో సానుభూతి పెంచుకునేలా స్కెచ్ వేస్తున్నారు. అందుకే వ్యూహాత్మకంగా కబ్జా ఆరోపణలు చేస్తున్నారు.