కమ్యూనిస్టులు ఉన్నంతకాలం తెలంగాణలో బీజేపీకి స్థానం లేదని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో వైష్ణవి గ్రాండ్ హోటల్ లో మంగళవారం జరిగిన నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు- మన కర్తవ్యాలు అనే అంశంపై మాట్లాడారు. ప్రజా ఉద్యమాలకు అండగా ఉండటానికి శాసనసభలో కమ్యూనిస్టుల ప్రాతినిధ్యం అవసరమని చెప్పారు. అఖిల భారత కమిటీ నిర్ణయం మేరకు ఆయా రాష్ట్రాలలో సర్దుబాటు చేసుకునే వీలుందని చెప్పారు.
తమకు కూడా కేరళలో కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థిగా ఉందని, అయినప్పటికీ బీజేపీని ఓడించాలనే లక్ష్యంతో, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ముందుకెళ్తున్నామని చెప్పారు. త్వరలో జరిగే పార్లమెంట్ సమావేశంలో మోదీ ప్రభుత్వం ప్రమాదకరమైన చట్టాలను తీసుకురాబోతుందన్నారు. ఢిల్లీలో తీసుకొచ్చిన ప్రజా వ్యతిరేక ఆర్డినెన్స్‌ను అన్ని పార్టీలు ఖండించాయని, ఫెడరల్ వ్యవస్థను బలపరచాలనే లక్ష్యం ఉన్న వారందరూ ఆ ఆర్డినెన్స్‌ను వ్యతిరేకించాలని కోరారు. యూనిఫాం సివిల్ కోడ్‌ను బలవంతంగా దేశంపై రుద్దేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. దీనివల్ల ప్రజల మధ్య విభజన సృష్టించి మత విధ్వేషాలతో రాజకీయాలు చేయాలని చూస్తున్నదని పేర్కొన్నారు. దీన్ని ప్రజాస్వామ్యవాదులందరూ వ్యతిరేకించాలని కోరారు. 2024లో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే రాజ్యాంగం మరణ శాసనంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.