ధాన్యం నిల్వలో నూతన సాంకేతికత.. హెర్మటిక్ విధానంతో ఇలా స్టోర్ చేసుకోవచ్చు..!

-

నాణ్యమైన దిగుబడులను సాధించడం ఎంత ముఖ్యమో…కోత అనంతరం ఆయా ఉత్పత్తులను సురక్షితంగా నిల్వ చేయడం అంతకంటే చాలా ముఖ్యం..సరైన నిల్వ సౌకర్యాలు లేక దేశంలో ఏటా రూ.వేల కోట్ల విలువైన ఆహారోత్పత్తులు వృథా అవుతున్నాయి. ఎన్నో మార్కెట్ యాడ్లలో చేతికొచ్చిన పంట..వానకు తడిచిముద్దైన దాఖలాలు మనం ఎన్నో చూస్తున్నాం..నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సమస్యను అధిగమించవచ్చు. అవి ఎలానో ఈరోజు చూద్దాం..

పండించిన పంటను నిల్వ చేసుకుని కావాల్సినప్పుడు అమ్ముకోవడానికి వీలుగా నిల్వ గిడ్డంగుల సౌలభ్యం లేక ఆర్ధికంగా రైతులు నష్టపోతున్నారు. ప్రకృతి వైపరీత్యాలు, అకాల వర్షాల వల్ల కోసిన పంట తడిసి, రంగుమారి, చీడపురుగులు ఆశించి నిల్వలో నాణ్యత కోల్పోయి రైతుకు నష్టాన్ని మిగుల్చుతుంది.

విదేశాల్లో ఆహార ధాన్యాలను రిటెక్ సాంకేతిక విధానంలో శాస్త్రీయ పద్ధతుల్లో నిల్వ చేస్తున్నారు. భారత్లోనూ పంట నాణ్యత చెడిపోకుండా నిల్వలో హెర్మెటిక్ విధానాన్ని అవలంబించి దీర్ఘకాలం తక్కువ ఖర్చుతో నిల్వ చేసుకోవచ్చు. ఈ కొత్త సాంకేతిక విధానంలో గాలి తగలకుండా తేమ శాతం పెరగకుండా నిల్వచేస్తారు. ఈ పద్ధతిలో పంటను కకూన్ గిడ్డంగిలో ఆక్సిజన్ ను తొలగించి కార్బన్ డై ఆక్సైడ్ నింపుతారు. దీంతో గుడ్డుదశలో ఉన్న లార్వా, ప్యూపా దశ పురుగులు, పెరిగిన చీడ పురుగులు నిల్వచేసిన ఆహార ధాన్యాల్లో జీవించలేక చనిపోతాయి. ఈ విధానంలో దీర్ఘకాలం పాటు ఆహార ధాన్యాలను రైతులు నిల్వ చేసుకోవచ్చు.

హెర్మటిక్ విధానంతో కలిగే ప్రయోజనాలు

ఇది సురక్షితమైన సేంద్రియ విధానం.

ఎలాంటి రసాయన పదార్థాలు ఉపయోగించకుండా హెర్మెటిక్

ప్లాస్టిక్ సంచులు లేదా కకూన్ గిడ్డంగుల్లో తక్కువ ఖర్చుతో నిల్వ చేయవచ్చు.

ధాన్యంలో 14 శాతం కన్నా తేమను తగ్గించి దీర్ఘకాలం పాటు నిల్వచేసుకోవచ్చు.

నాణ్యత చెడిపోకుండా కకూన్ గిడ్డంగిలో ఆక్సిజన్ తొలగించి, కార్బన్ డై ఆక్సైడ్ నింపి చీడ పురుగు పట్టకుండా ధీర్ఘకాలం నిల్వచేసుకోవచ్చు.

ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా కకూన్ గిడ్డంగులను ఉపయోగించి రైతులు, రైతు సంఘాలు, సహకార సంఘాలు ఆహార ధాన్యాలను నిల్వ చేసుకోవచ్చు.

ధాన్యాల సముద్రయాన ఎగుమతికి హెర్మెటిక్ పద్ధతి అనువైనది.

ఈ పద్ధతిలో నిల్వచేయడం ద్వారా దాన్యం రంగు, రుచి, వాసన చెడిపోదు. దీర్ఘకాలం పాటు ధాన్యం నాణ్యంగా ఉంటుంది.

ధాన్యంలో అధిక తేమను తగ్గించడానికి సూర్యరశ్మి ఆధారంగా పనిచేసే సోలార్ డ్రయ్యర్లను వినియోగించి అకాల వర్షాల వల్ల తడిసిన పంటలో తేమ శాతాన్ని తగ్గించవచ్చు.

హెర్మెటిక్ సాంకేతిక విధానంలో ప్లాస్టిక్ సంచులు, సోలార్ డ్రైయర్లు, కకూన్ గిడ్డంగుల్లో రైతులు సామూహికంగా కానీ, వ్యక్తిగతంగా కానీ పంట నిల్వ చేసుకొని రవాణా ఖర్చులను తగ్గించుకోవచ్చు.

సాధరణ గిడ్డంగులతో వచ్చే సమస్య..

గిడ్డంగుల్లో నిల్వచేసిన ధాన్యాల్లో పురుగు పట్టడం సర్వసాధారణమే. అన్ని ఆహార ధాన్యాల్లో ముక్కు పురుగులు ఆశించి ఎంతో నష్టాన్ని కలిగిస్తాయి. ఆడపురుగులు అయితే ధాన్యంపై గుడ్లు పెడతాయి. లార్వా దశలో ఉన్న పురుగులు ధాన్యం గింజలను తొలచి తిని వృద్ధి చెందుతాయి. 25-30 డి. సెం.గ్రే. గది ఉష్ణోగ్రత పురుగులకు అనుకూలంగా ఉంటుంది. ఆహార ధాన్యాల్లో పురుగు పట్టకుండా ఫాస్పిన్ అనే రసాయనంతో పొగ వేసి నిల్వచేస్తున్నారు. ధాన్యాన్ని దీర్ఘకాలం నిల్వ ఉంచాల్సి వచ్చినప్పుడు అల్యూమినియం ఫాస్పైడ్ ఉపయోగించి తరచుగా ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. ఇలా ఫాస్పిన్ పొగ ఉపయోగించి నిల్వ చేయడం ద్వారా ఆహార ధాన్యాల్లో ఫాస్పిన్ అవశేషాలు ఎక్కువైపోతున్నాయి. ఇది ఆరోగ్యానికి చీడ పురుగులు ఫాస్పిన్ ట్రీట్మెంటు లొంగకుండా బలోపేతమవుతున్నాయి. సాధారణ గిడ్డంగుల్లో ఈ పద్ధతిలో నిల్వ ఉంచిన ఆహారధాన్యాల్లో నష్టాలు అధికం అవుతున్నాయి.

హెర్మటిక్ వల్ల లాభం ఏంటంటే..

హెర్మెటిక్ సాంకేతిక విధానంలో ఎలాంటి రసాయనాలు వాడాల్సిన అవసరం లేకుండా సేంద్రియ విధానంలో ఆహార ధాన్యాలు నిల్వ చేయవచ్చు. ఈ విధానంలో వరి, గోధుమ, చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, వాణిజ్య పంటలైన మిరప, పసుపు, కాఫీ, తేయాకు, మిరియాలు వంటి ఆహార ధాన్యాలను దీర్ఘకాలం నాణ్యత చెడిపోకుండా తక్కువ ఖర్చుతో రైతులు తమ ఇంటి వద్దనే నిల్వఉంచుకోవచ్చు.

చిన్న, సన్నకారు రైతులు పండించిన పంటను ఇంటివద్దే నిల్వ చేసుకోవడానికి హెర్మెటిక్ సంచులు ఉపయోగపడతాయి. గోనె సంచుల్లో లేదా ప్లాస్టిక్ సంచుల్లో హెర్మెటిక్ లైనర్ సంచులను నింపి ఆహార ధాన్యాలను తక్కువ కాలం పాటు నిల్వ చేయొచ్చు.. 25, 50, 75 కిలోల సామర్థ్యం గల హెర్మెటిక్ సంచులు లభిస్తాయి. 50 కిలోలు నిల్వ చేసే బస్తా ధర రూ.35 నుంచి రూ.75 దాకా ఉంటుంది.

హెర్మటిక్ కకూన్ గిడ్డంగులు

వీటిలో రైతులు, రైతు సంఘాలు, సహకార సంఘాలు పండించిన పంట నిల్వ చేసుకోవచ్చు. కకూన్ సంచార గిడ్డంగులను ఉపయోగించడానికి ఎలాంటి శాశ్వత కట్టడాలు అవసరమే లేదు. ఆరుబయటే వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ గిడ్డంగులు వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలను కూడా తట్టుకుని నిల్వ ఉంచిన ధాన్యాన్ని కాపాడుతాయి. ఇవి 5 నుంచి 300 టన్నుల దాకా సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

సోలార్ మడత పెట్టెలు

సాధారణంగా రైతులు పంట పొలాల్లో, రహదారుల వెంట ప్లాస్టిక్ టార్పాలిన్లపై ధాన్యాన్ని పోసి ఎండబెడతారు. ఈ పద్ధతిలో వర్షాలు, ఈదురుగాలుకు అవి చిరిగిపోయి.. నష్టం కలుగుతుంది. సోలార్ డ్రయ్యర్లు, మడత పెట్టెలు ఉపయోగించి నాణ్యత చెడిపోకుండా ఆహార ధాన్యాలను ఆరబెట్టవచ్చని హెర్మటిక్ సాంకేతికి నిపుణులు కృష్ణ కిషోర్ తెలిపారు.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news