ఎడిట్ నోట్: బీఆర్ఎస్ కథలు..!

-

మొత్తానికి టీఆర్ఎస్ పార్టీని కాస్త జాతీయ పార్టీగా బీఆర్ఎస్‌గా మార్చేశారు కేసీఆర్..జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడమే కాకుండా…మోదీ సర్కార్‌ని గద్దె దించడమే లక్ష్యంగా కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించేశారు. ఇక దీనికి కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదముద్ర వేయడమే తరువాయి. సరే ఈ పార్టీ ద్వారా దేశాన్ని మార్చేస్తానని, తెలంగాణని నెంబర్ 1లో ఉంచినట్లు దేశాన్ని కూడా నెంబర్ 1లో ఉంచుతానని కేసీఆర్ చెప్పుకొస్తున్నారు.

అసలు తెలంగాణ నెంబర్ 1 అయిందా…దేశాన్ని నెంబర్ 1 చేయడానికి అనే డౌట్ రావొచ్చు. ఏ డౌట్ ఉన్నా కేసీయా రాజకీయాన్ని గమనించడమే తప్ప చేసేదేమీ లేదు. అయితే ఈ బీఆర్ఎస్ పార్టీ ప్రకటనపై తెలంగాణలోనే కాదు..ఏపీలో కూడా గట్టిగానే స్పందన వచ్చింది..అలాగే తెలుగు ప్రజల ఉన్న రాష్ట్రాల్లో కూడా బాగా స్పందన వచ్చిందని, కేసీఆర్ కాబోయే ప్రధాని అని టీఆర్ఎస్ వర్గాలు తెగ ప్రచారం చేసేస్తున్నాయి.

తెలంగాణ మొత్తం దసరా రోజు టీఆర్ఎస్ శ్రేణుల సందడి నెలకొంది. అటు ఏపీలో కూడా కొందరు కేసీఆర్ అభిమానులు బీఆర్ఎస్ పార్టీకి స్వాగతం పలికారు. అలాగే ఏపీకి కూడా కేసీఆర్ కావాలని కొందరు డిమాండ్ చేశారు. అదే విధంగా ఏపీలో కొందరు టీడీపీలో ఉన్న కేసీఆర్ సన్నిహితులు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని కథనాలు వస్తున్నాయి. ఆ కథనాలు నిజమో కాదో కొన్ని రోజుల్లో తెలుస్తోంది.

ఇక బీఆర్ఎస్ ఏర్పాటుపై తెలంగాణలోని కాంగ్రెస్, బీజేపీలు సెటైర్లు వేశాయి. బార్ అండ్ రెస్టారెంట్ సమితి పార్టీ అంటూ జోకులు వేశారు. అసలు తెలంగాణ అనే పేరునే కేసీఆర్ లేకుండా చేస్తున్నారని, తెలంగాణ ద్రోహి అని విమర్శలు వచ్చాయి. రాష్ట్రంలోనే అధికారం కోల్పోయేలా ఉన్నారు..ఇంకా దేశ రాజకీయాల్లో ఏం చేస్తారని సెటైర్లు పేలాయి. అటు ఏపీ విషయానికొస్తే..బీఆర్ఎస్ ప్రభావం ఏపీలో ఉండదని వైసీపీ నేతలు చెప్పుకొచ్చారు. దీనిపై స్పందించమని టీడీపీ అధినేత చంద్రబాబుని అడిగితే..ఆయన ఒక నవ్వు నవ్వి వదిలేశారు.

ఇతర రాష్ట్రాల్లో కేసీఆర్‌కు మద్ధతు తెలిపేవారు మాత్రం..కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ఏదో చేసేస్తారని చెప్పుకొచ్చారు. అసలు దీనిపై జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్, ఇతర పార్టీలు పెద్దగా స్పందించలేదు. మరి చూడాలి రానున్న రోజుల్లో కేసీఆర్ జాతీయ పార్టీ ఏ విధంగా ముందుకెళుతుందో.

Read more RELATED
Recommended to you

Latest news