ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో రోజుకొక వింత వినాల్సి వస్తోంది. మొన్నటి వరకు ఎన్నికల ఓటేసేందుకు విదేశాల్లో ఉన్న వారిని రప్పించేందుకు అభ్యర్థులు విమాన టికెట్లు బుక్ చేశారు. తాజా రక్త సంబంధికులే ప్రత్యర్థులుగా మారారు. సాధారణంగా పోటీలో దిగే అభ్యర్థులు రెండు వర్గాలకు చెందిన వారుండటంతో ఇద్దరి మధ్య తీవ్ర పోటీ నెలకొంటుంది. ప్రచారానికి వెళ్లినప్పుడు ఇరువురు పరస్పర విమర్శలు, ఒకరిపై ఒకరు తప్పుడు ప్రచారాలు చేసుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం ఒకే కుటుంబం, ఒకే రక్తంతో పుట్టిన అన్నదమ్ములు, అక్క చెల్లె్లళ్లే అభ్యర్థులుగా పోటీలో దిగి ప్రత్యర్థులుగా మారారు.
గెలుపెవరిదో..?
ప్రకాశం జిల్లా కొండపి మండలం మిట్టపాలెంలో 793 ఓట్లు ఉండగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు 380 దాకా ఉంటాయి. ఇక్కడ సర్పంచ్ సీటు ఎస్సీకి రిజర్వ్ కావడంతో సొంత అన్నదమ్ములు బొడ్డు నరసింహం, బొడ్డు అంకయ్యలు నామినేషన్లు దాఖాలు చేసి గెలుపు కోసం బయలు దేరారు.
ఒకే ఊరిలో పుట్టిన ఇద్దరు ఈదర రాజకుమారి, ఈదర సౌంధర్య కలిసిమెలసి ఇంటర్ పూర్తి చేశారు. సొంత గ్రామంలోనే ఒకే ఇంటి పేరున్న వారికిచ్చి వివాహం చేశారు. పకాశం జిల్లా కారంచేడు మండలంలోని కుంకలమర్రు గ్రామంలో ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. దీంతో గ్రామంలోని రెండు వర్గాల వారు వీరినే పంచాయతీ బరిలోకి దింపారు. చిన్నప్పటి నుంచి కలిసిమెలసి తిరిగిన వారు.. ఇప్పుడు గెలుపు కోసం ఎవరికి వారే ప్రచారంలో దూసుకుపోతున్నారు.