శ్రీ సత్యసాయి జిల్లాలో కొనసాగుతున్న నారా లోకేశ్ పాదయాత్ర….

అందరికీ నీతిని బోధించే ఎమ్మెల్యే కేతిరెడ్డి మాత్రం గుట్టలు ఆక్రమించుకుంటాడని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర శ్రీ సత్యసాయి జిల్లాలో కొనసాగుతోంది. పాదయాత్ర నేడు పుట్టపర్తి నియోజకవర్గంలో ముగిసి ధర్మవరం నియోజకవర్గంలో ప్రవేశించింది. ఈ క్రమంలో, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిని లక్ష్యంగా చేసుకుని లోకేశ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చెప్పేవి నీతులు… దోచేవి గుట్టలు అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమం నిర్వహిస్తారని, నిజాయతీగా ఉండాలంటూ ఉద్యోగులకు నీతులు చెబుతుంటారని వ్యంగ్యం ప్రదర్శించారు.

Lokesh targets MLA Kethireddy

ఇలా అందరికీ నీతిని బోధించే ఎమ్మెల్యే కేతిరెడ్డి మాత్రం గుట్టలు ఆక్రమించుకుంటాడని లోకేశ్ ఆరోపించారు. ఇది మరో రుషికొండ అని, ఎమ్మెల్యే విలాసాలకు అడ్డా అని లోకల్ గా టాక్ వినిపిస్తోందని అన్నారు. 902, 909 సర్వే నెంబర్లలో 20 ఎకరాలను ఆక్రమించారని వివరించారు. ఎర్రగుట్టను కబ్జా చేసిన కేతిరెడ్డి విలాసవంతమైన ఫాంహౌస్ నిర్మించుకున్నారని ఆయన మండిపడ్డారు.