అమ‌రావ‌తి చుట్టూనే రాజ‌కీయం.. విజ‌న్ 2024

-

రానున్న కాలంలో అమ‌రావ‌తి చుట్టూనే రాజ‌కీయం సాగ‌నుంది. ఒక్క రూపాయి చెల్లించ‌కుండా కొన్ని ప్రాథ‌మిక ఒప్పందాల్లో భాగంగానే ఆ రోజు భూ స‌మీక‌ర‌ణ‌కు రైతును త‌మ ప్ర‌భుత్వం ఒప్పించింద‌ని టీడీపీ అంటోంది. ఆ త‌రువాత ఒప్పందాల‌ను తుంగలో తొక్కి జ‌గ‌న్ స‌ర్కారు వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని కూడా అంటోంది. ఈ నేప‌థ్యంలో వచ్చే ఎన్నిక‌ల్లో  ఎవ‌రు గెల‌వాల‌న్నా ఎవ‌రు త‌మ పంతం నెగ్గించుకోవాల‌న్నా రాజ‌ధాని పై స్ప‌ష్ట‌త ఇవ్వాల్సిందే ! ఇప్ప‌టికే మ‌హానాడులో ఓ తీర్మానం చేశారు టీడీపీ నాయ‌కులు. 3 రాజ‌ధానులు కాదు ఒక్క రాజ‌ధానే అదే ఆంధ్రుల రాజ‌ధాని అమ‌రావ‌తి అని చెప్పేశారు. ఇదే తీర్మానంను అన్ని ప్రాంతాల నాయ‌కులూ బ‌ల‌ప‌ర్చి వ‌చ్చారు.

అమ‌రావ‌తిని అంగీక‌రించ‌డం అన్న‌ది ఇప్పుడు వైసీపీకి కూడా స‌వాలే ! కానీ వైసీపీ వ్యూహాత్మ‌కంగా కొద్దిగా డబ్బులు కేటాయించి ఎన్నిక‌ల ముందు రైతుల‌ను కాస్తో కూస్తో సంతోష పెట్టే ప‌నులు చేయ‌వ‌చ్చు అని కూడా తెలుస్తోంది. రాజ‌కీయ ఎత్తుగ‌డ‌ల్లో భాగంగా అదేం త‌ప్పు కాక‌పోయినా ప‌నుల్లో నిజాయితీ ఉంటే, రాజ‌ధాని రైతుకు  న్యాయం ద‌క్క‌డం సులువు అవుతుంద‌ని,  స‌త్వ‌ర న్యాయం జ‌రిగితే జ‌గ‌న్ పై వారికి న‌మ్మ‌కాలు పెరిగే అవ‌కాశాలే మెండుగా ఉంటాయ‌ని ప‌రిశీల‌కులు అంటున్నారు.

జ‌గ‌న్ వ్యూహం ప్ర‌కారం సీఆర్డీఏకు ఆనుకుని ఉద్యోగుల‌కు ఓ లే ఔట్ వేసి ఇవ్వాల‌ని  అనుకుంటున్నారు. కాస్త చౌక‌గానే భూములు ఇచ్చి వారి మ‌న‌సులు గెలుచుకోవాల‌ని అనుకుంటున్నారు. ఇది కూడా రాజ‌కీయ ఎత్తుగ‌డ‌లో భాగ‌మే అయినా ఈ ప‌ని కూడా సంబంధిత అధికారులు మ‌రియు ఇత‌ర నాయ‌కులు నిజాయితీ గా చేసిన‌ప్పుడే లే ఔట్ ప్ర‌క్రియ అన్న‌ది స‌జావుగా
సాగుతుంది. లేదంటే మ‌ళ్లీ స‌మ‌స్య మొద‌టికే వ‌చ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ విధంగా కొద్దిగా ప‌నులు ప్రారంభించి, కొంద‌రు కాంట్రాక్ట‌ర్ల బిల్లులు కూడా క్లియ‌ర్ చేసి దిగిపోవాల‌ని జ‌గ‌న్ అనుకుంటున్నార‌ని తెలుస్తోంది.

ఓ విధంగా వైసీపీ కాంట్రాక్ట‌ర్లు ఎవ్వ‌రూ ఇప్ప‌టిదాకా పెద్ద పెద్ద ప‌నులేవీ రాజ‌ధానికి సంబంధించి తల‌కెత్తుకోలేదు. ప్ర‌భుత్వం కూడా వీలున్నంత వ‌ర‌కూ రాజ‌ధాని భూమిని త‌న‌ఖా పెట్టి అప్పులు తెచ్చేందుకే ప్రాధాన్యం ఇచ్చింది కానీ, వీటి అభివృద్ధికి ఇంత‌వ‌ర‌కూ పెద్ద‌గా ఆస‌క్తి చూప‌లేదు. ఎందుకంటే పాల‌న సంబంధ రాజ‌ధానిగా వైజాగ్ ను చేయాల‌ని అనుకుంటున్నారు క‌నుక కేవ‌లం అసెంబ్లీ, శాస‌న మండ‌లి వ్య‌వ‌హారాల‌కే ఈ ప్రాంతంను ప‌రిమితం చేయాల‌ని అనుకుంటున్నారు క‌నుక గ‌త ప్ర‌భుత్వం చేప‌ట్టిన ఏ నిర్మాణాన్నీ పూర్తి చేయాల‌ని భావించ‌లేదు.


దీంతో గ‌తంలో మాదిరిగానే చాలా ప‌నులు ప్రాథ‌మిక ద‌శ‌లో ఉండ‌గానే ఆగిపోయాయి. కొన్ని కొంత‌వ‌ర‌కూ వ‌చ్చి ఆగిపోయాయి. వాటి కొన‌సాగింపు అయితే లేదు. తాజాగా బీజేపీ కూడా తాము అధికారంలోకి వ‌స్తే మూడేళ్ల‌లో అమ‌రావ‌తి పూర్తి చేస్తామ‌ని చెబుతోంది. అదే క‌నుక జ‌రిగితే..  మంచిదే! జ‌న‌సేన కూడా అమ‌రావ‌తికే ఓటు వేస్తుంది. ఈ ద‌శ‌లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎవ‌రు ఏం చెప్పినా ముందు రాజ‌ధానిపై స్ప‌ష్ట‌త ఇచ్చాకే మాట్లాడాల్సి ఉంటుంది. ఇప్ప‌టికే జ‌గ‌న్ ఓ సారి మాట ఇచ్చి త‌ప్పారు. ఎన్నిక‌ల ప్ర‌చారం లో భాగంగా అమ‌రావ‌తే రాజ‌ధాని అని చెప్పారు. త‌రువాత కొంద‌రి స‌ల‌హాల ప్ర‌భావంతో 3 రాజ‌ధానుల ఫిలాస‌ఫీని వినిపిస్తూ వ‌స్తున్నారు. ఈ ఫిలాస‌ఫీ ఎలా ఉన్నా కూడా మూడు పంట‌లు పండే భూమిని ప్ర‌భుత్వానికి ధారాద‌త్తం చేసిన రైతుకు రానున్న కాలంలో జ‌గ‌న్ కానీ వేరొక‌రు కానీ మేలు చేసే విధంగా ఉంటే చాలు.

Read more RELATED
Recommended to you

Latest news