తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని భావించే ఉత్తరాంధ్రలో అనేక మార్పులు రానున్నాయి. పార్టీ పరంగా వచ్చే ఈ మార్పుల కారణంగా రేపటి వేళ వైసీపీ వర్గాలను మరింత బలంగా ఢీ కొనే విధంగా సిద్ధం అవుతున్నాయి ద్వితీయ శ్రేణీ వర్గాలు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఇంకా ఇంకొందరు ఇప్పటికే పార్టీని మరింత బలోపేతం చేసేందుకు పనిచేస్తున్నారు. బీసీల నాయకత్వం మరింత వర్థిల్లేందుకు చేయని ప్రయత్నమంటూ లేదు.
ఒకనాడు అన్న ఎర్రన్న మాదిరిగానే అచ్చెన్న కూడా పనిచేస్తున్నారు. ఉత్తరాంధ్ర ఫస్ట్ పార్టీ నెక్ట్స్ అన్న విధంగా ఈ ప్రాంతానికి జరిగిపోతున్న అన్యాయంపై అధికార పార్టీ నాయకులను ప్రశ్నిస్తున్నారు. నిలదీస్తున్నారు. అంతేకాదు ఒకప్పుడు పార్టీకి బాగా కలిసి వచ్చిన వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం మళ్లీ మళ్లీ చేస్తున్నారు.ఈ క్రమంలో టీడీపీ విజయావకాశాలు మెరుగుపడుతున్నాయి. ఒకవేళ లోకేశ్ పాదయాత్ర చేస్తే, అందుకు ఉత్తరాంధ్రలో ఏదో ఒక నియోజకవర్గంను ఎంపిక చేసుకుని ఇక్కడి నుంచే ప్రారంభిస్తే, పార్టీకి మునుపటి ప్రాభవం వచ్చేందుకు అవకాశాలుంటాయని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. మూడేళ్ల తరువాత వచ్చిన బాబు ఇకపై కూడా అదేవిధంగా .. ఉత్తరాంధ్ర పర్యటనలకు ప్రాధాన్యం ఇచ్చి, ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో వాస్తవాలు తెలుసుకుని పార్టీలో దిద్దుబాటు చర్యలు వేగవంతం చేస్తే మంచి ఫలితాలు రానుండడం ఖాయమని అంటున్నారు కార్యకర్తలు. ఈ క్రమంలోనే ఉత్తరాంధ్ర ఫస్ట్ పార్టీ నెక్ట్స్ అన్న వాదన నినాదంగా మారుతోంది. పార్టీకి మళ్లీ అధికారం దక్కాలంటే ముందుగా ఈ ప్రాంతం నుంచే సానుకూల పవనాలు వీయడం ప్రారంభం కావాలి అన్నది కార్యకర్తల మాట.
ఇప్పటిదాకా తెలుగుదేశం పార్టీలో మార్పులు ఎన్నో వచ్చాయి. ఉన్నట్టుండి ఆ పార్టీలో వచ్చిన మార్పుల కారణంగా మంచి ఫలితాలే వచ్చాయి. కొన్ని ఫలితాలు అనుకూలించకపోయినా కూడా ఏదో ఒక విధంగా నెట్టుకువచ్చిన దాఖలాలూ ఉన్నాయి. అయినప్పటికీ పార్టీలో జవం జీవం నింపే పనులు చంద్రబాబు చేస్తూనే ఉన్నారు. ఏదో విధంగా ప్రజల మధ్యకు రావాలని పరితపిస్తూనే ఉన్నారు. ఇదే ఇప్పుడు పెద్ద చర్చకు తావిస్తోంది. ఇటీవల చంద్రబాబు నేతృత్వంలో శ్రీకాకుళం లో చేపట్టిన రోడ్ షో
చాలా అంటే చాలా విజయవంతం అయింది. దిగువ శ్రేణి నాయకుల్లో ఉత్సాహం ద్విగిణీకృతం అయింది. దీంతో పార్టీలో మునపటి ఆనందం మరియు ఉత్సాహం తొణికిసలాడింది కూడా! గతంలో మాదిరిగానే పార్టీకోసం అహరహం శ్రమించేందుకు కార్యకర్తలు సన్నద్ధం అవుతున్నారు. ఇక నాయకులు కూడా కాస్త మార్పు చెందితే ఉత్తరాంధ్రలో మంచి ఫలితాలే వస్తాయి.