కేసీఆర్ కు బండి సంజయ్ లేఖ..ఉచిత స్టడీ సర్కిళ్లు పెట్టాలి

-

ముఖ్యమంత్రి కేసీఆర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ యువతీ యువకులకు అసెంబ్లీ నియోజకవర్గానికొక స్టడీ సర్కిల్‌ ఏర్పాటు చేయాలని లేఖలో డిమాండ్‌ చేశారు. గత రెండేండ్లుగా కోవిడ్‌ మహమ్మారి వల్ల తలెత్తిన ఆర్థిక ఇబ్బందుల వల్ల యువతీ, యువకులు పోటీపరీక్షల కోసం పెద్ద ఎత్తున ఖర్చుపెట్టే పరిస్థితి లేదని మండిపడ్డారు.

మారుమూల గ్రామాల నుండి శిక్షణ కొరకు జిల్లా కేంద్రాలకు రావడం నిరుద్యోగ యువతకు వ్యయప్రయాసలతో కూడిన అంశం. కాబట్టి నియోజకవర్గానికొక ఉచిత స్టడీ సర్కిల్‌ను ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు అదనపు ఖర్చులు తగ్గించాలన్నారు. ఈ కోచింగ్‌ కేంద్రాలలో శిక్షణ పొందే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వమే ఉచితంగా అల్పాహారం, భోజన సౌకర్యాలు కల్పించాలి. ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని… ప్రైవేట్‌ కోచింగ్‌ సెంటర్లలో ఫీజుల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసి ఫీజులు నియంత్రించాలని కోరారు.

పార్టీల ద్వారా ఏర్పాటు చేసే కోచింగ్‌ సెంటర్ల వల్ల అభ్యర్థుల్లో రాగద్వేషాలు ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో టీశాట్‌, ప్రభుత్వ స్టడీ సర్కిల్స్‌, కోచింగ్‌ కేంద్రాల ద్వారానే నిరుద్యోగ యువతకు శిక్షణనివ్వాలని కోరారు. ప్రతిజిల్లా, నియోజకవర్గ కేంద్రాలలో గ్రంథాలయాలను ఏర్పాటు చేయాలి. నిరుద్యోగ యువతకు అవసరమైన కోచింగ్‌ మెటీరియల్‌ ఉచితంగా అందించాలని… వెంటనే టెట్‌ ఎంట్రన్స్‌ పరీక్ష నిర్వహించాలని డిమాండ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news