కర్ణాటక ఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగుతోంది. అయితే.. తాజాగా కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్ణాటక కాంగ్రెస్
మ్యానిఫెస్టోలో భజరంగ్ దళ్, పీఎఫ్ఐ లాంటి మత విద్వేషాలు చేసే సంస్థలను నిషేధిస్తామని పేర్కొన్న విషయం తెలిసిందే. దీంతో
దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌పై భజరంగ్ దళ్ నేతలు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఢిల్లీలో భజరంగ్ దళ్ నేతలు కాంగ్రెస్ పార్టీ తీరుపై ఆందోళనలు చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. భజరంగ్ దళ్‌ని బ్యాన్ చేయాలనే కలలు మానుకోవాలని హెచ్చరించారు.
భజరంగ్ దళ్ వంటి జాతీయవాద సంస్థను పీఎఫ్ఐ వంటి నిషేధిత తీవ్రవాద సంస్థతో పోల్చడం సరికాదన్నారు. 1996 సంవత్సరం నుంచి నేటి వరకు, 86 లక్షలకు పైగా ఆవులను వధ నుండి రక్షించారు, ఇందులో అనేక మంది భజరంగ్ దళ్ కార్యకర్తలు తమ ప్రాణాలను అర్పించారని, జాతీయ వాదం, ధర్మం కోసం మాత్రమే భజరంగ్ దళ్ పని చేస్తోందని వారు వెల్లడించారు.