ఏపీకి హ్యాండిచ్చిన కేంద్రం..రాష్ట్రం పై ఆశలు వదుకున్నట్లేనా ?

-

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై మరోసారి మొండి చేయి చూపించింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే పలు సందర్భాల్లో దీని పై కొంత క్లారిటీ ఇచ్చానా.. మరోసారి తన వైఖరిని లోక్‌సభలో స్పష్టం చేసింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని తేల్చేసింది. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీతో పాటు అనేక మినహాయింపులు ఇచ్చినట్టు చెప్పింది కేంద్రం. ఒక్కో నిర్ణయంతో ఏపీలో ప్రజలకు దూరమవుతున్న బీజేపీ ఇక రాష్ట్రం మీద ఆశలు వదులుకుందా అన్న చర్చ మొదలైంది.

రాష్ట్ర విభజన జరిగి ఏడేళ్లయింది. ప్రత్యేక హోదా హామీకి అతీ గతీ లేదు. కేంద్రంలో యూపీయే సర్కారు ప్రత్యకే హోదా హామీ ఇచ్చింది. ఎన్డీఏ సర్కారు వచ్చాక హోదాను క్రమంగా నీరు గార్చింది. .అసలు యూపీయేకీ హోదాపై చిత్తశుద్ధి లేదని, ఉంటే విభజన చట్టంలో చేర్చేవారనే వాదన కూడా ఉంది. కాంగ్రెస్, బీజేపీ కలిసి రాష్ట్ర విభజన చేశాయి.. ఈ రెండు పార్టీలు హోదా విషయంలోనూ ఒకే మాటపై ఉన్నాయి. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ మాట మార్చింది. హోదాకు, ఆర్థిక సంఘానికి లింకు పెట్టి ఏపీకి హ్యాండిచ్చింది.

విభజనతో అన్నిరకాలుగా నష్టపోయిన ఏపీని ఆదుకోవాలాంటే.. ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీజేపీ నేతలు గట్టిగా పోరాడారు. రాజ్యసభలో ఆ పార్టీ నేతలు అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు హోదా కోసం పట్టుబట్టారు. వెంకయ్య నాయుడైతే హోదా ఐదేళ్లు కాదు పదేళ్లు కావాలన్నారు. కానీ ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి ప్రధాని మన్మోహన్ హామీ ఇచ్చారు. పార్లమెంట్ లో ప్రధాని మాటకు విలువ ఉంటుందనే ఉద్దేశంతో.. అప్పుడు అన్ని పార్టీలు సరేనన్నాయి. కానీ పార్లమెంట్ లో ప్రధాని లాంటి అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తి చెప్పిన మాటకు కూడా విలువ లేదని ప్రత్యేక హోదా అంశంతో మరోసారి తేలిపోయింది.

ప్రత్యేక హోదా కల్పించిన రాష్ట్రానికి కేంద్రం మెరుగైన సదుపాయాలు అందించేందుకు గ్రాంట్ల రూపంలో ఆర్థికసాయాన్ని అందిస్తుంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇస్తున్న నిధుల్లో 30 శాతం నిధులను మొదట ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకే పంచుతారు. ఆ తర్వాతే మిగిలిన 70 శాతం నిధులను ఇతర రాష్ట్రాలకు అందిస్తారు. కేంద్ర ప్రభుత్వ పథకాల్లో 90 శాతం నిధులను గ్రాంట్లుగా, 10 శాతం నిధులను ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు రుణంగా ఇస్తారు. పన్నుల్లో మినహాయింపు కూడా ఉంటుంది.

2019 ఎన్నికల్లో ప్రత్యేక హోదా అంశం బలంగా పనిచేసింది. బీజేపీకి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. హోదా కోసం పోరాటం చేసిన, తెస్తామని చెప్పిన వైసీపీ ఘన విజయం సాధించింది. అయితే కేంద్రంలో మోడీకి కూడా భారీ సంఖ్యలో ఎంపీ సీట్లు రావడంతో.. హోదా విషయంలో అడగడం తప్ప ఏమీ చేయలేమని జగన్ స్పష్టం చేశారు. సీఎంగా తొలి ఢిల్లీ పర్యటనలోనే హోదా ఇచ్చేదాకా అడుగుతూనే ఉంటామని చెప్పిన జగన్.. డిమాండ్ చేసే పరిస్థితి మాత్రం లేదని, బీజేపీకి కావల్సిన దాని కంటే ఎక్కువ బలం ఉందని చెబుతున్నారు.

హోదా రాదని తేలిపోయింది. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేదని స్పష్టమైపోయింది. ఉద్యమాలు, పోరాటాలు వృథాయేనని కేంద్రం స్పష్టత ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల నుంచి సాధ్యమైనన్ని నిధులు రాబట్టుకుని..ఇక రాష్ట్రాభివృద్ధి కోసం ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రచించాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news