తెలంగాణపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫుల్ ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. మళ్ళీ తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా బాబు ముందుకెళుతున్నారు. ఎలాగో కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్‌ని వదిలి బీఆర్ఎస్ పార్టీతో జాతీయ రాజకీయాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఏపీలో కూడా ఎంట్రీ ఇచ్చారు. దీంతో తెలంగాణలో మళ్ళీ పార్టీని గాడిలో పెట్టేందుకు బాబు లైన్ లోకి వచ్చారు. కాసాని జ్ఞానేశ్వర్‌ని అధ్యక్షుడుగా నియమించి..ఖమ్మంలో భారీ సభ పెట్టి సక్సెస్ అయిన విషయం తెలిసిందే.
అక్కడ నుంచి తెలంగాణలో టీడీపీ శ్రేణులు యాక్టివ్ గా పనిచేయడం మొదలుపెట్టాయి. అటు కాసాని సైతం..గ్రామ గ్రామానికి తెలుగుదేశం పార్టీ వెళ్ళేలా కార్యక్రమాలు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆయా జిల్లా నేతలతో సమావేశమవుతూ పార్టీ పరిస్తితులని తెలుసుకుంటూ..పార్టీ బలోపేతానికి సూచనలు చేస్తున్నారు. అదే సమయంలో జిల్లాల వారీగా భారీ సభలకు ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఖమ్మంలో సభ పెట్టి సక్సెస్ అయ్యారు. ఇదే ఊపులో నిజామాబాద్ లో నెక్స్ట్ సభకు ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ భారీ స్థాయిలో సభ నిర్వహించాలని టీటీడీపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు.
ఇదే నెలలో సభ ప్లాన్ చేయాలని చూస్తున్నారు. తాజాగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నేతలతో కాసాని సమావేశమై..సభ విషయంపై చర్చించారు. అయితే చంద్రబాబుతో మాట్లాడక సభ తేదీని ఖరారు చేయాలని డిసైడ్ అయ్యారు. ఆ తర్వాత మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాల్లో సైతం సభలు నిర్వహించాలని చూస్తున్నారు. చివరిలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో సింహగర్జన సభ పెట్టాలని చూస్తున్నారు. మొత్తానికి తెలంగాణలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా టీడీపీ ముందుకెళుతుంది. మరి టీడీపీ కాస్త బలపడిన అధికార బీఆర్ఎస్ పార్టీకే నష్టమని విశ్లేషణలు వస్తున్నాయి. చూడాలి మరి తెలంగాణలో టీడీపీ ప్రభావం ఏ మేర ఉంటుందో.