అనుకున్న విధంగా కేసీఆర్ రాణించడం లేదు అన్నది విపక్షాల విమర్శ. అనుకున్న విధంగా రాణించేందుకు విపక్షాలు అనుకున్నంత సులువు కాదు అన్నది కేసీఆర్ ఉవాచ. ఉచిత సలహాలు వంద ఇవ్వొచ్చు కానీ పాటింపే కష్టం అన్నది కేసీఆర్ భావన కూడా! అందుకే ఆయన కాంగ్రెస్ తరఫు సలహాలు కానీ బీజేపీ తరఫు సలహాలు కానీ తీసుకోరు.
తానేంటో తన పనేంటో అంతవరకూ మాత్రమే పరిమితం అవుతారు. తెలంగాణలో కేసీఆర్ మాదిరిగానే ఇంకొందరు నాయకులు కూడా మాటలతో అగ్గి పుట్టించేందుకు తెగ తాపత్రయం పడుతున్నారు కానీ అవేవీ ఇప్పట్లో సాధ్యం అయ్యేలా లేవు. అయినా కూడా కేసీఆర్ కు పరిణామాలు అనుకూలంగా లేవు.
రాష్ట్రంలో పరిణామాలు బాగున్నా జాతీయ స్థాయిలో ఎదిగేందుకు ఆయనకు ఉన్న భుజ బలం కానీ బుద్ధి బలం కానీ చాలడం లేదు. ఆ విధంగా కేసీఆర్ కు జాతీయ స్థాయి రాజకీయాలు మరోసారి కూడా కలిసి రాని విధంగానే ఉన్నాయి. ఈ ప్రమాదం ముందుగానే గుర్తించి లేదా పసిగట్టి కేసీఆర్ అప్రమత్తం అయ్యారు. బలమైన మోడీకి బలమైన నాయకత్వం మాత్రమే జవాబు ఇవ్వగలదు. ఆ విధంగా కేసీఆర్ ఇంకా బలమైన నాయకుడు అయితే కాదు. 17 మంది ఎంపీలు ఉన్న తెలంగాణలో కేసీఆర్ జాతీయ స్థాయిలో రాణించాలని అనుకోవడం అత్యాశే!
ఈ దశలో కేసీఆర్ కు పీకే గుర్తుకు వచ్చాడు. ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే అనే బీహారీ గతంలో చాలా మందికి అమృతం ఇచ్చాడు. ఇదే సమయంలో తన మాటకు ఎదురే లేదని నిరూపించాడు. కనుకనే జగన్ మొదలుకుని షర్మిల వరకూ ఆయన మాట వినేందుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. పీకే టీంలో కొందరు షర్మిలకు ఇప్పటికే సాయం చేస్తున్నారని సమాచారం ఉంది.
అదేవిధంగా పీకే టీంలో కొందరు చంద్రబాబు తరఫున రంగంలో ఉన్నారని కూడా సమాచారం ఉంది. ఒకే వ్యక్తి ఇంతమందికి సలహాలు ఇచ్చి, ఇంతమంది ప్రత్యర్థుల మధ్య ఏ విధంగా రాణిస్తున్నాడో కానీ ఇదే విషయం కేసీఆర్ నూ ఆకట్టుకుందనే అనుకోవాలి. లేదా నిర్థారణ చేసుకోవాలి. అందుకే జాతీయ స్థాయిలో ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో పొలిటికల్ హీట్ పెరిగిపోతున్న తరుణాన కేసీఆర్ మరోసారి తన బుర్రకు పనిచెప్పి సీన్లోకి పీకేను తీసుకువచ్చారు.
ఏదేమయినా కూడా ఉత్తరప్రదేశ్ లో ఎన్నికల ఫలితాల తరువాత పీకే టీం తన పని మరింత వేగవంతం చేస్తే మేలు. అందాక కేసీఆర్ కూడా కాస్త ఆగమాగం కాకుండా ఉంటే ఇంకా మేలు. అందాక వేడిని కాస్త భరించాలి. పొలిటికల్ ఫీవర్ ను ఇంకాస్త భరించి పరిణామాలను అర్థం చేసుకుని వర్తమానంలో రాణించాలి. భవిష్యత్ లో నాయకుడిగా ఇంకా చెప్పాలంటే జాతీయ స్థాయి నాయకుడిగా కేసీఆర్
స్థిరపడాలి.