హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ తీరాన రయ్..రయ్…అంటూ రేసింగ్ కార్లు సందడి చేస్తున్నాయి. దేశీయంగా జరుగుతున్న ఫార్ములా కార్ రేసింగ్ పోటీలు మొట్ట మొదటిసారిగా హైదరాబాద్ లో జరుగుతుండటంతో ఈ పోటీల కోసం భాగ్యనగరవాసులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. నేటి ఇండియన్ రేసింగ్ లీగ్ ముగిసింది. ఉర్రూతలూగించిన ఈ రేసులో ‘గాడ్ స్పీడ్ కొచ్చి’ టీమ్ 417.5 పాయింట్లతో మొదటిస్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక 385 పాయింట్లతో బ్లాక్ బర్డ్స్ హైదరాబాద్ టీమ్ రెండో స్థానంలో నిలిచింది. మూడో స్థానంలో గోవా (282 పాయింట్లు), నాలుగో స్థానంలో చెన్నై (279 పాయింట్లు), ఐదో స్థానంలో బెంగళూరు (147.5 పాయింట్లు), ఆరో స్థానంలో ఢిల్లీ (141 పాయింట్లు) జట్లు నిలిచాయి. ఈసారి రేసింగ్ లో ఆరు టీమ్స్, 12 కార్లు, 24 మంది డ్రైవర్స్ పాల్గొన్నారు.
ఈ పోటీలో 250 నుంచి 300 కిలోమీటర్ల స్పీడ్ తో స్పోర్ట్స్ కార్లు దూసుకుపోయాయి. ఇండియన్ రేసింగ్ లీగ్ సందర్భంగా అంతకుముందు మూడ్రోజుల పాటు (డిసెంబరు 9 నుంచి 11 వరకు) పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేశారు. రేసింగ్ జరిగే హుస్సేన్ సాగర్ ఏరియాలో ట్రాఫిక్ డైవర్షన్లు అమలయ్యాయి. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి ఇవాళ్టి వరకు వరకు నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్, ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ రోడ్లను మూసివేశారు. మూడ్రోజులపాటు ఎన్టీఆర్ గార్డెన్స్, ఎన్టీఆర్ ఘాట్, నెక్లెస్ రోడ్, లుంబినీ పార్క్ మూసివేశారు.