మరో పోరుకు సిద్ధమవుతున్న కాంగ్రెస్

-

తెలంగాణలో మరోమారు ఎన్నికలు హాడావుడి నెలకొననుంది. రాష్ట్రంలోని వరంగల్‌, ఖమ్మం కార్పోరేషన్ లతో పాటు సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్‌ మున్సిపాలిటీలకు ఏప్రిల్ 30న పోలింగ్‌ జరుగనుంది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా వరంగల్‌, ఖమ్మం నగరపాలక సంస్థల ఎన్నికల కోసం ప్రత్యేకంగా కమిటీలను ప్రకటించింది. ఆ వివరాలను టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్ రెడ్డి శనివారం వెల్లడించారు.

వరంగల్‌ కార్పోరేషన్ కు మొత్తం 13 మందితో, అలానే ఖమ్మం కార్పోరేషన్ కు 11మంది సభ్యులతో కూడిన కమిటీలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వరంగల్‌ కమిటీకి సంబంధించి కన్వీనర్‌గా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, కో-కన్వీనర్‌గా ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు నియమితులయ్యారు. అలానే ఖమ్మం నగర పాలక సంస్థ కమిటీకి మాజీ ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్ కన్వీనర్‌గా వ్యవహరించనుండగా, భట్టి విక్రమార్క, డీసీసీ అధ్యక్షుడు దుర్గా ప్రసాద్, మాజీ కేంద్ర మంత్రులు రేణుకా చౌదరి, బలరామ్‌ నాయక్‌ తదితరులు సభ్యులుగా ఉన్నారు.

కాగా రాష్ట్రంలో కాంగ్రెస్ క్రమంగా బలహీనపడుతుంది. గతంలో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలో మూడో స్థానానికి పరిమితమైన కాంగ్రెస్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అయితే నాగార్జున సాగర్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. ఆ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి గెలుపుపై కాంగ్రెస్ ధీమాగా ఉంది. కాగా రానున్న వరంగల్‌, ఖమ్మం కార్పోరేషన్ లతో పాటు మిగిలిన మున్సిపాలిటీలలో జయకేతనం ఎగురవేయాలని ఆ పార్టీ వ్యూహాలు రచిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news