గత కొన్నిరోజులుగా సీఎం జగన్ జనాల్లో తిరుగుతున్న విషయం తెలిసిందే…ఇంతకాలం ప్రభుత్వం నడిపే పనిలో ఉన్న జగన్..జనంలోకి పెద్దగా రాలేదు…కరోనా సమయంలో సచివాలయానికే పరిమితమయ్యారు. దీంతో జగన్ జనాలకు దూరం అవుతున్నారనే సంకేతాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే జగన్ రూట్ మార్చారు. తమ ఎమ్మెల్యేలని జనంలోనే ఉండమని చెప్పిన జగన్…తాను కూడా జనంలో తిరుగుతున్నారు. ఇప్పటికే వరద బాధితులని పరామర్శించే కార్యక్రమం చేశారు. అలాగే పథకాలకు సంబంధించి బటన్ నోక్కే కార్యక్రమాలని జనం మధ్యలోనే చేస్తున్నారు.
తాజాగా కాపు నేస్తం పథకానికి సంబంధించి బటన్ నోక్కే కార్యక్రమాన్ని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో చేశారు. ఈ క్రమంలోనే కాపు ఓటర్లని ఆకట్టుకునే విధంగా జగన్ ప్రసంగం సాగింది. అదే సమయంలో కాపు ఓటర్లు ఎక్కువగా పవన్ వైపు మొగ్గు చూపుతున్నారనే సంకేతాలు అందుతున్న నేపథ్యంలో…పవన్ పై జగన్ విమర్శలు చేశారు. పవన్…చంద్రబాబు దత్తపుత్రుడు అని, కాపు ఓట్లని గంపగుత్తగా బాబుకు తాకట్టు పెట్టేసే కార్యక్రమం జరుగుతుందని అన్నారు. అలాగే కాపు వర్గానికి చెందిన మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ..కాపు యువత పవన్ ని నమ్మొద్దని మాట్లాడారు.
అయితే కాపులని పవన్ వైపు గాని, టీడీపీ వైపు గాని వెళ్లకుండా ఉండాలని విధంగా వైసీపీ ప్లాన్ ఉంది. వాస్తవానికి గత ఎన్నికల్లో కాపు ఓటర్లు మెజారిటీ స్థాయిలో వైసీపీకి మద్ధతు తెలిపారు…అందుకు ఉదాహరణే ఉభయ గోదావరి జిల్లాల్లో గెలిచిన వైసీపీ కాపు ఎమ్మెల్యేలు. ఇక గత ఎన్నికల మాదిరిగానే ఈ సారి కూడా కాపులు తమకు కాపు కాసేలా చేసుకోవాలని జగన్ చూస్తున్నారు. కానీ గత ఎన్నికల మాదిరిగా ఈ సారి కాపులు…వైసీపీ వైపు మొగ్గుచూపడం సాధ్యమయ్యేలా లేదు..కాపులకు సంబంధించి పూర్తి స్థాయిలో న్యాయం చేయడంలో జగన్ ప్రభుత్వం సక్సెస్ అయినట్లు కనిపించడం లేదు.
అదే సమయంలో అటు పవన్, ఇటు చంద్రబాబు దూకుడుగా రాజకీయం చేస్తున్నారు..పైగా వారు గాని ఈ సారి కలిస్తే కాపులు..వైసీపీకి దూరమయ్యే ఛాన్స్ ఉంది. మొత్తానికి పవన్ నమ్మొద్దని చెబుతున్న వైసీపీ నేతల మాటలని జనం నమ్మేలా లేరు.