వైసీపీ వర్సెస్ టీడీపీ-బీజేపీ-జనసేన..ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో జరుగుతుంది ఇదే. అధికార వైసీపీపై మూడు పార్టీలు గట్టిగానే విమర్శలు చేస్తున్నాయి. కాకపోతే ఇక్కడ మూడు పార్టీలు కలిసి ఉన్నాయా? అంటే అక్కడ కొన్ని సమీకరణాలు ఉన్నాయి. మూడు పార్టీల మధ్య పొత్తు మాత్రం ఫిక్స్ కాలేదు. కానీ జనసేన, బిజేపిల మధ్య అధికారికంగా పొత్తు ఉంది. కానీ వారు కలిసి పనిచేయడం లేదు. టిడిపి, జనసేనల మధ్య అధికారికంగా పొత్తు ఫిక్స్ కాలేదు కానీ ఆ రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి.
ఇక ఈ రెండు పార్టీలతో బిజేపి కలుస్తుందా? లేదా? అనేది చూడాలి. బిజేపి ఏమో టిడిపి పొత్తుకు ఆసక్తిగా ఉందో లేదో క్లారిటీ లేదు. ఇటు టిడిపి శ్రేణులు మాత్రం బిజేపితో పొత్తు వద్దంటే వద్దని అంటున్నారు. రాష్ట్రంలో బిజేపిపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, ఇలాంటి సమయంలో బిజేపితో పొత్తు పెట్టుకుంటే టిడిపికే నష్టమని అంటున్నారు. కానీ ఇటీవల చంద్రబాబు, అమిత్ షా, జేపి నడ్డాలని కలిశారు. ఇక తాజాగా ఏపీకి వచ్చి షా, నడ్డా..జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. దీంతో బిజేపి సైతం వైసీపీపై ఎటాకింగ్ మొదలుపెట్టింది. ఇక మూడు పార్టీలు ఒక్కటే అని వైసీపీ ప్రచారం చేస్తుంది. అయితే ఇక్కడ కొన్ని ట్విస్ట్‌లు ఉన్నాయి. ఇంతకాలం వైసీపీ, బిజేపి పరోక్షంగా సహకరించుకున్నాయి. ఇప్పుడు వర్షన్ మార్చాయి. అయితే బిజేపిపై ఉన్న వ్యతిరేకత వైసీపీకి వచ్చే ఛాన్స్ ఉందని ప్రచారం వచ్చింది. ఈ క్రమంలోనే వైసీపీ, బిజేపిలు కలిసి..టిడిపిని దెబ్బతీయడానికి కొత్త గేమ్ షురూ చేశాయని అంటున్నారు.
ఈ క్రమంలోనే బిజేపి..వైసీపీని టార్గెట్ చేసి..టిడిపికి అనుకూలంగా ఉన్నట్లు మారింది. దీని వల్ల బిజేపిపై ఉన్న యాంటీ టిడిపికి వెళుతుంది. పైగా టిడిపి, జనసేన, బిజేపి మూడు పార్టీలు కలిసి వైసీపీని టార్గెట్ చేయడం వల్ల..జగన్ పై జనాల్లో సానుభూతి కూడా వస్తుందని అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజమవుతుందో చూడాలి. ఈ పోరు ఎంతదూరం వెళుతుందో.