హైదరాబాద్‌ పాతబస్తీలో గ్యాంగ్‌ వార్‌ కలకలం

-

పార్కింగ్ స్థలం వద్ద తలెత్తిన చిన్న వివాదంతో మాట మాట పెరిగి కత్తులతో దాడి చేసుకున్న ఘటన చంద్రాయణ గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. నిత్యం రద్దీగా ఉండే బార్కస్‌ ప్రాంతంలోని ఓ జిమ్‌కు ఫహద్‌, ఖాలీద్‌ అనే ఇద్దరు వ్యక్తులు వచ్చారు. జిమ్‌ పక్కనే ఉన్న ఓ షాపు ఎదుట తమ వాహనాన్ని పార్క్‌ చేశారు. దీంతో ఆ షాపు యజమాని అక్కడ వాహనం పెట్టొద్దంటూ వారికి చెప్పాడు. దీంతో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇదంతా చూస్తున్న ఓ రౌడీషీటర్‌ సులేమాన్‌ సీన్‌లోకి ఎంటర్‌ అయ్యాడు. గొడవను ఆపాలని తన వంతు ప్రయత్నం చేశాడు. దీంతో చెలరేగిన ఫహద్‌ తన సోదరుడు అయిన చంద్రాయణగుట్ట రౌడీషీటర్‌ అలీకి ఫోన్‌ చేసి రమ్మని చెప్పాడు. రావడంతోనే కత్తులతో విన్యాసాలు చేసుకుంటూ అక్కడికి వచ్చిన అలీ యజమాని.. సులేమాన్‌తో వాగ్వాదానికి దిగాడు. సులేమాన్‌పై అలీ కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశాడు.

 

ఈ ఘటనతో బార్కస్‌లో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. సమాచారం తెలుసుకున్న చంద్రాయణగుట్ట ఇన్‌స్పెక్టర్‌ నాగేంద్రప్రసాద్‌ వర్మ అక్కడికి చేరుకుని వారిపై లాఠీఛార్జ్‌ చేసి చెదరగొట్టారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. సకాలంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోవడంతో ప్రాణహాని తప్పిందని స్థానికులు అంటున్నారు. కత్తులతో రోడ్డుపై దాడి చేసుకోవడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ పరిణామంతో స్థానికులు కాసేపు టెన్షన్ పడ్డారు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయానికి గురయ్యారు. చివరికి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకురావడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. రోడ్డుపై కత్తులతో దాడి చేసుకున్న ఈ ఘటన కలకలం రేపుతోంది. రెండు వర్గాలు గ్యాంగ్ వార్‌కు దిగడం టెన్షన్ పుట్టిస్తోంది. కత్తులు, కొడవళ్లతో దాడి చేసుకోవడం సంచలనంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news