బిఆర్ఎస్ రాష్ట్ర కేటీఆర్, ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గండిలచ్చపేట గ్రామంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్, సావిత్రీభాయి పూలే విగ్రహాన్ని ఆవిష్కరించారు. కేసీఆర్ ప్రగతి ప్రాంగణాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యం లో అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ, భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి గ్రామంలో వైకుంఠధామం ఏర్పాటు చేసుకున్నాం అని కేటీఆర్ అన్నారు. డంపింగ్ యార్డు, నర్సరీ, ట్రాక్టర్ ట్రాలీ, పల్లె ప్రకృతి వనం, తెలంగాణ క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేసుకున్నాం. ఇలాంటి పథకాలు దేశంలోని ఇతర గ్రామాల్లో లేవు అని తెలియచేశారు. ఈ తీరుగా పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు.
దేశంలో ఉత్తమ గ్రామపంచాయతీలు తెలంగాణలోనే ఉన్నాయని కేంద్రం ప్రకటించింది అని అన్నారు. ఇలాంటి పనులు చేయడం వల్లే అవార్డులు వస్తున్నాయన్నారు. కంటి వెలుగులాంటి కార్యక్రమం దేశంలో ఎక్కడా అమలు చేయడం లేదు. గుడ్డితనం వచ్చే దాకా బతికిన వారు చాలా మంది ఉన్నారు. వయసు పెరిగే కొద్ది కంటి, ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే సీఎం కేసీఆర్ నాయకత్వంలో కంటి వెలుగు కార్యక్రమం చేపట్టాం. అక్కరున్న వారికి కండ్లద్దాలు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని కేటీఆర్ వెల్లడించారు.
దళిత బంధు లాంటి పథకాలు అమలు కావాలంటే నాయకుడికి గుండె నిండా ధైర్యం ఉండాలన్నారు. ఊకదంపుడు ఉపన్యాసాలతో ఐదేండ్లు టైం పాస్ చేసిన సీఎంలు చాలా మంది ఉన్నారని వారి పై మండిపడ్డారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధుతో వ్యాపారాలు పెట్టి, లాభాలు పొందుతున్నామని లబ్దిదారులు చెబుతున్నారు అని తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 40 వేల కుటుంబాలకు లబ్ది జరిగిందని పేర్కొన్నారు కేటీఆర్.