బహిరంగ సభలు, పాదయాత్రలో మనుగోడులో రాజకీయ సందడి నెలకొంది. ఇప్పటికే మునుగోడులో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయగా.. సీఎం కేసీఆర్ టీఆర్‌ఎస్ పార్టీ మునుగోడు ప్రజాదీవెన పేరిట భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే.. బీజేపీ సమరభేరి పేరిట నేడు భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. ఈ సభలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమిత్ షా తెలంగాణకు ఎందుకొస్తున్నారంటూ నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారని… అయ్యా కేసీఆర్ గారూ, తెలంగాణలో కుటుంబ పాలనను అంతం చేయడానికే అమిత్ షా వస్తున్నారన్నారు. తెలంగాణ తల్లికి స్వేచ్ఛను కల్పించడానికి వస్తున్నారని అన్నారు కిషన్‌రెడ్డి. మునుగోడు సభలో ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు కిషన్‌రెడ్డి.
మోదీ తనను గోకకపోయినా, తాను ఆయనను గోకుతానని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి స్పందిస్తూ… అయ్యా కేసీఆర్ గారూ మీకు దురదపెడితే గోక్కోండని ఎద్దేవా చేశారు. మునుగోడు పులిబిడ్డ, నల్గొండ ముద్దుబిడ్డ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అని కిషన్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే పదవిని కోమటిరెడ్డి తృణప్రాయంగా వదులుకున్నారని కిషన్‌రెడ్డి చెప్పారు. కల్వకుంట్ల కుటుంబానికి ప్రతి తెలంగాణ బిడ్డ బుద్ధి చెపుతారని అన్నారు కిషన్‌రెడ్డి. తప్పు చేయకపోతే కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు కిషన్‌రెడ్డి. సీబీఐ, ఈడీలను కేంద్ర ప్రభుత్వం నియంత్రించదని చెప్పారు. మునుగోడులో టీఆర్ఎస్ కు పరాభవం తప్పదని అన్నారు కిషన్‌రెడ్డి.