ఖమ్మం టీఆర్ఎస్ నేతల ఐక్యతకు కొత్త ఫార్ములా

-

కెటీఆర్ క్లాస్ పీకడంతో దిగొచ్చారో లేక బలపడాలంటే కలిసుండాలని గుర్తించారో తెలియదు కానీ ఖమ్మం నేతలిపుడు కొత్త ఐక్యతారాగం ఆలపిస్తున్నారు. నిన్నటిదాకా ఎడమొహం పెడమొహంగా తిరిగిన నేతలంతా ఒక్కసారిగా స్నేహగీతం ఆలపిస్తున్నారు. విభేదాలు వదిలేసి కలిసిపోయామనే సంకేతాలిస్తున్నారు.

ఖమ్మం టీఆర్ఎస్ పార్టీ అంటేనే ఆల్ మిక్స్ డ్ లీడర్స్ ఇన్ వన్ పార్టీ అనేలా ఉంటుంది. ఈ జిల్లాలో ఉన్న నేతలంతా ఇతర పార్టీల నుంచి వచ్చినవారే. అందరూ ఒకే వేదికమీదున్నా, సఖ్యత అంతగా ఉండేది కాదు. ఈ విభేదాలు ఈ మధ్య తారా స్థాయికి చేరాయి. వాటిని పరిష్కరించటానికి ఏకంగా పార్టీ అధిష్టానమే ప్రయత్నించింది. దీంతో విభేదాలకు చెక్ పెట్టేందుకు జోరుగా విందురాజకీయాలు నడుపుతున్నారట సీనియర్లు.

అధికార పార్టీలో ఎప్పుడైనా గ్రూపులు, విభేదాలు చాలా సహజం. వాటిని అధిగమించి సాగటమే అసలైన ఛాలెంజ్. ఇప్పుడు ఖమ్మం టీఆర్ఎస్ నేతలు కూడా ఇదే దారిలో కనిపిస్తున్నారు. వైరా నియోజకవర్గానికి చెందిన ఎంఎల్ఎ రాముల్ నాయక్, మాజి ఎంఎల్ఎ మదన్ లాల్ ఇద్దరిని నామా నాగేశ్వర రావు ఇంటికి పిలిచి రాజీ చేసినట్లుగా టాక్ ఉంది. దీనికి సంబంధించిన పోటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. మొన్నటి ఎన్నికల్లో రాముల్ నాయక్ కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్ధిగా వైరా నుంచి పోటీచేసి గెలుపొందారు. ఆ తరువాత టిఆర్ఎస్ లో రాముల్ నాయక్ చేరినప్పటికి టిఆర్ఎస్ నుంచి పోటీచేసి ఓడిన మదన్ లాల్ తో సరిపడని పరిస్థితి ఉంది. వారిద్దరిని కలపడానికి ఎంపి నామా కృషి ఫలించిందనే టాక్ నడుస్తోంది.

అటు సత్తుపల్లి లోనూ మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యల మద్య విభేదాలు తీవ్రస్థాయికి చేరాయి. ఎమ్మెల్యే కు తెలియకుండా ఎవ్వరు పడితే వారు గ్రామాల్లోకి వస్తే పార్టీ ఎలా బతుకుతుందని సండ్ర చేసిన వ్యాఖ్యలు.. నాకు ఎవరి పర్మిషన్ అవసరం లేదు పాస్ పోర్టు అవసరం లేదంటూ మాజీ ఎంపి పొంగులేటి చేసిన వ్యాఖ్యలు జిల్లా రాజకీయాలను హాట్ హాట్ గా మార్చేశాయి. అయితే కెటిఆర్ తో సమావేశం అనంతరం సత్తుపల్లి లో జరిగిన విందుతో సీన్ మారింది.

సత్తుపల్లి మున్సిపాలిటీ పాలకవర్గం ఏడాది అయినసందర్బంగా ఆంధ్ర బోర్డర్ లోని ఓ పామాయిల్ తోటలో విందు ఇచ్చారు. దీనికి ఎమ్మెల్యే సండ్రతో పాటుగా, ఆయన వర్గానికి చెందిన మున్సిపల్ చైర్మన్ మహేష్ , పొంగులేటి వర్గానికి చెందిన మాజీ డిసిసిబి చైర్మన్ మువ్వా విజయ్ బాబు, అదే వర్గానికి చెందిన మట్టా దయానంద్ లు విందులో పాల్గొన్నారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నట్టు నేతలు కలరింగ్ ఇచ్చారట..మరి ఈ విందు రాజకీయాల దోస్తీ ఎంత కాలం ఉంటుందో మరి.

Read more RELATED
Recommended to you

Latest news