ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పాత తగాదాలు కొలిక్కి రావడం లేదు. అలా అని ఆర్థిక మూలాలు మరింత బలపడి రాష్ట్రాన్ని ఊహించని విధంగా ప్రగతి పథంలో నడిపించడం లేదు. ఏ విధంగా చూసుకున్నా రాజధాని గొడవ ఇప్పట్లో తీరేలా లేదు. ఆ మాటకు వస్తే కోర్టు చుట్టూ మరోసారి వైసీపీ పెద్దలు తిరిగే అవకాశాలే మెండుగా ఉన్నాయి. ముఖ్యంగా రాజధాని నిర్మాణానికి రైతుల నుంచి సేకరించిన భూములును అభివృద్ధి చేసి అక్కడ నిర్మాణాలు చేపట్టాలని, అదేవిధంగా ఒప్పందం ప్రకారం అభివృద్ధి చేసిన భూములను రైతులకు కేటాయించడమే కాకుండా, వాళ్లకు సకాలంలో పరిహారం కూడా ఇవ్వాలని కోర్టు గతంలో చెప్పింది.
కానీ ఇప్పుడు ఇవేవీ జరగకపోగా పనులన్నీ ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. ఇదే ఇప్పుడు కొత్త వివాదానికి తావిస్తోంది. హై కోర్టు చెప్పినా నిర్ణయాలు అమల్లో పట్టించుకోని నైజం ఒకటి కనిపిస్తోందని మండిపడుతున్నారు రాజధాని రైతులు. మంచి ఉద్దేశంతో భూములు ఇచ్చినా కూడా తమకు న్యాయం జరగడం లేదని వీరంతా వాపోతున్నారు. ఇటు పంటలు లేక అటు ఆదాయం లేక.. రాజధాని నిర్మాణాలూ ముందుకు సాగక అన్ని విధాలా అన్నింటినీ కోల్పోయిన తమను ఆదుకోవాలని మరో మారు న్యాయ స్థానంను ఆశ్రయించారు రాజధాని రైతులు.
ఇప్పటిదాకా ఒక్కటంటే ఒక్క నిర్ణయంలో కూడా ఎటువంటి పరిణితీ చూపించని, చూపించలేని స్థితిలో వైసీపీ సర్కారు ఉందని టీడీపీ ఆరోపిస్తుంది. తాము ఆ రోజు రాజధానిగా ఎంపిక చేసిన ప్రాంతాన్ని అమరావతి అని పేరు పెట్టి అభివృద్ధి చేసినా, వద్దని మూడు ప్రాంతాలకూ సమ ప్రాధాన్యం ఉండాలని చెబుతూ, అప్పటికే నిర్మాణంలో ఉన్న వాటిని నిలుపుదల చేసి జగన్ సర్కారు తాత్సారం చేస్తుందని చెబుతూ రాజధాని రైతులు కోర్టు బోను ఎక్కారు. ఇప్పుడిక నిధుల సాకుతో పనులు ఆపేశారని, ఇదెంత మాత్రం భావ్యం కాదని, తక్షణమే తమకు న్యాయం చేయాలని కోరుతూ రాజధాని రైతులు న్యాయ పోరాటానికి మరో మారు సిద్ధం అవుతున్నారు.
రాజధాని ఎంపిక తరువాత కట్టడం ఇవన్నీ ఎప్పుడో అయిపోయిన విషయాలు. కానీ జగన్ వచ్చాక అంతా మారిపోయింది. 3 రాజధానుల గురించి మాట్లాడడం మొదలు పెట్టాక పరిణామాలు మళ్లీ మారిపోయాయి. ఆ విధంగా విశాఖ కేంద్రంగా పాలన రాజధాని అని ఒకటి తీసుకువస్తామని అన్నారు. కానీ అమరావతిని శాసన వ్యవహారాలకు సంబంధించిన రాజధానిగా ఉంచుతామని అన్నారు. న్యాయ సంబంధ వ్యవహారాలకు రాయలసీమ ప్రాంతం కర్నూలును ఎంపికచేశామని అన్నారు. ఇవన్నీ వద్దని ఆ రోజు ఏం చెప్పారో అదే చేయాలని పట్టుబడుతూ రాజధాని రైతులు మళ్లీ హైకోర్టుకు వెళ్లారు. రాజధాని నిర్మాణం తదితర పనులకు సంబంధించి మళ్లీ కదలిక లేకుండా పోయిందని ఆ విధంగా జగన్ కోర్టు ధిక్కార నేరానికి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ రాజధాని రైతుల తరఫున పిటిషన్లు దాఖలు అయ్యాయి. వీటిని హై కోర్టు విచారించనుంది.