బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఈడీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ఈడీ నోటీసులపై పైలెట్ రోహిత్ రెడ్డి స్పందిస్తూ.. ఎమ్మెల్యేల కొనుగోలు గుట్టును రట్టు చేసినందుకే ఈడీ సమన్లు వచ్చాయని భావిస్తున్నట్టు అన్నారు. బండి సంజయ్ చెప్పిన రెండు రోజులకే ఈడీ సమన్లు వచ్చాయని అన్నారు. నాకు నోటీసులు వచ్చే విషయం బండి సంజయ్‌కి ఎలా తెలుసని ప్రశ్నించారు పైలెట్ రోహిత్ రెడ్డి. బండి సంజయ్‌కి భవిష్యవాణి తెలుసా ? అని వ్యాఖ్యానించారు పైలెట్ రోహిత్ రెడ్డి. ఈడీ, సీబీఐలు బండి సంజయ్ కింద పని చేస్తున్నాయా ? అని ప్రశ్నించారు. ఈడీ తన బయోడేటా అడగడం హాస్యాస్పదమని అన్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న కుట్రను అడ్డకునేందుకే ఈ సమన్లు వచ్చాయని అనుకుంటున్నట్టు అన్నారు.
ఈ నోటీసులకు తాను భయపడేది లేదని అన్నారు. ఈ వ్యవహారంలో తగ్గేది లేదని తెలిపారు పైలెట్ రోహిత్ రెడ్డి. అంతకుముందు ఈడీ ఇచ్చిన నోటీసులపై ఏం చేయాలనే దానిపై తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తన న్యాయవాదులతో చర్చించారు. హైద్రాబాద్‌లోని మణికొండలో ఉన్న పైలెట్ రోహిత్ రెడ్డికి ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చేందుకు వచ్చారు. అయితే ఆ సమయంలో రోహిత్ రెడ్డి అక్కడ లేరు. దీంతో రోహిత్ రెడ్డి పీఏకు ఈడీ అధికారులు సమాచారం ఇచ్చారు. ఈ నోటీసులను మణికొండలో ఉన్న ఎమ్మెల్యే సిబ్బందికి ఈడీ అధికారులు అందించారు. ఈడీ నోటీసులపై ఏం చేయాలనే దానిపై ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చర్చించారు.