గెలిచినా, ఓడినా తామంతా కొన్ని నియమాలకు కట్టుబడి రాజకీయం చేస్తామని వైసీపీ నాయకులు అంటున్నారు. ఇవన్నీ బాగున్నాయి మరి ! విద్యార్థుల ఓటమినీ, విద్యా వ్యవస్థల వైఫల్యాన్నీ ఏ విధంగా అర్థం చేసుకోవాలి అని అంటోంది ఓ వర్గం. పరిశీలక వర్గం. గెలుపో ఓటమో ఛోడ్ దో యుద్ధం చేశామా లేదా అన్నదే ముఖ్యమని చెప్పడం బాగుంది కానీ, అసలీ యుద్ధం చేసిన క్రమమే బాలేదని అలాంటప్పుడు ఓటములు పట్టించుకోకుండా ఎలా ఉండగలం అని మరో వాదన కూడా వినవస్తోంది.
ముఖ్యంగా వైఫల్యం చెందిన లేదా జీరో ఫలితాలు వచ్చిన 22 ప్రభుత్వ బడుల విషయమై ప్రభుత్వం పునరాలోచనలో పడింది.
ఇందుకు ముఖ్యంగా కారణాలను వెతికే పనిలో పడింది. అయితే ఈ కారణాల వెతుకులాటలు పార్టీ పరంగా జరుగుతున్నాయా ? లేదా ప్రభుత్వ పరంగా జరుగుతున్నాయా ? పార్టీ వైఫల్యం అని అనుకునేందుకు లేదు. ఇది ప్రభుత్వ వైఫల్యమే కానీ ఆ ప్రభుత్వాన్ని నడుపుతున్నది పార్టీ కి చెందిన నాయకులే కదా ! కనుక ఈ ఓటమి ప్రభుత్వానిదీ మరియు పార్టీదీ అని అంటోంది టీడీపీ. లాజిక్కులు తీస్తే .. ఇదే నిజం కూడా ! ఏదేమయినా ఆ 22 బడులకు మళ్లీ మంచి రోజులు రావాలంటే ఇప్పటి వైఫల్యాలు తొలగాలి.
ఇంకా కొన్ని సర్కారు బడుల్లో అరవై శాతం వరకే రిజల్ట్ రావడానికి ఓ కారణం.. మెగా డీఎస్సీ లేకపోవడం. సిబ్బంది నియామకాలు లేకపోవడం. అసలు 3,4,5 తరగతులను హై స్కూలులో విలీనం చేయాలన్న తలంపు రావడం..వాటిపైనే దృష్టి సారించడం. ముఖ్యంగా ప్రాథమిక విద్య పరంగా తీసుకున్న ఈ గందరగోళ నిర్ణయం కొన్ని చోట్ల మిశ్రమ ఫలితాలనే అందించింది.
ఏదేమయినప్పటికీ ఇంగ్లీషు మీడియం బోధనలో ఉన్న వైఫల్యాలు కొన్ని, తెలుగు మీడియం విద్యార్థులు కూడా అటుగా మొగ్గు చూపినా సరైన శ్రద్ధ వహించి చదవకపోవడం ఒకటి ఇవాళ ఎందిరనో డైలమాలో పడేసింది..అని తెలుస్తోంది. ముఖ్యంగా పరీక్షలను నిర్వహించే పద్ధతే బాగాలేదు అన్న విమర్శ కూడా ఉంది.
మూడు గంటల 15 నిమిషాలు ఓ పదో తరగతి విద్యార్థి పరీక్ష రాయడం అంటే చిన్న మాట కాదు. అది ఆ స్థాయి విద్యార్థులకు సంబంధించి మానసికంగా ఎంతో ఒత్తిడితో కూడిన విషయం అంటోంది సంబంధిత నిపుణుల వర్గం. ఏదేమయినప్పటికీ సంస్కరణలు మంచివా చెడ్డవా అన్నవి అటుంచితే వాటి ఫలితాలన్నవి ఎప్పటికప్పుడు ఓ వ్యవస్థ నడవడిని ప్రశ్నార్థకం చేయకూడదు అన్నది ఓ వాదన. ఆ విధంగా ఇప్పటి నుంచి తీసుకునే నిర్ణయాలలో పారదర్శకత, స్పష్టత అన్నవి ఉంచితే మంచి ఫలితాలు ఇకపై ఆ 22 బడుల్లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేందుకు అవకాశాలే పుష్కలం అన్నది ఓ బలీయమైన వాదన.