అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ ప్రధాన ప్యూహం ఇదే

-

ఏపీ అసెంబ్లీ సమావేశాలకు పార్టీలు సిద్దమవుతున్నాయి. తాము చేసిన సంక్షేమ కార్యక్రమాలను చెప్పుకునేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంటే.. సర్కార్‌ను టార్గెట్‌ చేయడానికి ప్రతిపక్షం కసరత్తు ముమ్మరం చేసింది. కనీసం పది రోజుల పాటైనా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని టీడీపీ డిమాండ్‌ చేస్తోంటే.. కరోనా సమయంలో వీలైనంత త్వరగా సమావేశాలను ముగించేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక ప్రశ్నోత్తరాలు జరిగే సూచనలు కన్పించకపోవడంతో.. ఈ అంశం నుంచే వైసీపీ-టీడీపీ మధ్య వార్ మొదలయ్యేలా ఉంది.

వింటర్‌ సీజన్‌లో హీట్‌ పుట్టించేలా ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. రేపటి నుంచి ఉభయ సభలు కొలువు తీరనున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో వివిధ అంశాలపై రాజకీయం రాజుకున్న క్రమంలో ఏపీ అసెంబ్లీ సమావేశాల వేదికగా తమ తమ వాదనలను వినిపించేందుకు.. రంగం సిద్దం చేసుకుంటున్నాయి పార్టీలు. అసెంబ్లీలోనే కాకుండా.. శాసన మండలిలో కూడా ఇదే స్ట్రాటజీతో వెళ్లడం ద్వారా ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకూడదనేది వైసీపీ వ్యూహంగా కన్పిస్తోంది. ఇక ప్రధాన ప్రతిపక్షం కూడా అదే స్థాయిలో తమ వ్యూహాలను సిద్దం చేసుకుంటోంది. ముఖ్యంగా మండలిలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటోంది.

తాము చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను సభా వేదికగా చెప్పుకుని.. ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం అధికార పార్టీ వైపు నుంచి స్పష్టంగా కన్పిస్తోంది. పోలవరం, ఇసుక కొత్త పాలసీ, రాజధాని, స్థానిక సంస్థల ఎన్నికలు, ఇళ్ల పట్టాల పంపిణీ, టిడ్కో ఇళ్ల కేటాయింపులు.. ఇలా రకరకాల అంశాల్లో ప్రతిపక్షానికి గట్టిగా బదులిచ్చేందుకు రంగం సిద్దం చేసుకుంటోంది వైసీపీ. టీడీపీ కూడా అదే స్థాయిలో అసెంబ్లీ సమావేశాలకు సన్నద్ధమవుతోంది. మొత్తం 15అంశాలు చర్చించాలని నిర్ణయించింది టీడీపీ. ఇసుక, పోలవరం కూల్చివేతలు, భూసేకరణలో అవినీతి, రాజధాని రైతుల ఆందోళనలు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ వంటి అంశాలపై చర్చించేందుకు పట్టు పట్టాలని నిర్ణయించుకుంది టీడీపీ. అసెంబ్లీలో అధికార పార్టీ తమకు ఎలాగూ అవకాశం ఇవ్వదు కాబట్టి.. మండలిలో పైచేయి సాధించేలా వ్యూహాత్మకంగా వెళ్లాలనేది టీడీపీ ప్రణాళిక. ఈ క్రమంలో ప్రశ్నోత్తరాల విషయంలో గట్టిగా పట్టుపట్టాలని టీడీపీ నిర్ణయించుకుంది.

గతంలో మంత్రులు, ప్రధాన ప్రతిపక్ష నేత, ఎమ్మెల్యేల రాకపోకలకు విడివిడిగా గేట్లు ఉండేవి. కానీ ఇప్పుడు అంతా ఒకే గేట్ ద్వారా లోనికి రావాల్సి ఉంటుంది. కరోనా పరిస్థితుల కారణంగా మీడియా పాయింట్‌కు పెట్టకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశాల్లో సుమారు 15 బిల్లులకు వరకు ఆమోదించే అవకాశం కన్పిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news