ఉమ్మడి ప్రకాశం జిల్లా, ఒంగోలు కేంద్రంగా మహానాడు నిర్వహణకు సంబంధించి తెలుగుదేశం పార్టీ పెట్టుకున్న అభ్యర్థనను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించడంతో కొత్త వివాదం మొదలయింది. మహా నాడు నిర్వహణకు సంబంధించి వర్షం వచ్చినా ఇతర సమస్యలేవీ తలెత్తకుండా ఉండేందుకు మినీ స్టేడియం ను ముందు ఇక్కడ ఎంపిక చేశారు. కానీ ఇందుకు ప్రభుత్వ అధికారులు సమ్మతించడం లేదు. ఆఖరి నిమిషం వరకూ విషయం పెండింగ్ లో ఉంచి తరువాత దరఖాస్తును తిరస్కరించారు. దీంతో టీడీపీ డైలమాలో పడిపోయింది.
గతంలో ఎన్నడూ లేని విధంగా మహానాడు నిర్వహించి, ప్రభుత్వ వైఫల్యాలను వినిపించడంతో పాటు పార్టీ ఏ విధంగా వచ్చే ఎన్నికలకు సిద్ధం కావాలి అన్న విషయమై యోచన చేసేందుకు ఈ మహానాడును వినియోగించుకోనున్నారు. ఇదే వేదికపై ఎన్టీఆర్ శత జయంత్స్యుత్సవాలు కూడా నిర్వహించి, ఆ మహనీయునికి నివాళులు అర్పించనున్నారు. అయితే మహానాడును ఒంగోలు సమీపాన మండువవారిపాలెంలో మినీ స్టేడియం బదులు ఇక్కడే ఉన్న రెవెన్యూ గ్రామ పరిధిలో త్రోవ గుంట వద్ద రెండు రోజుల పాటు అంటే ఈ నెల 27,28 తేదీలలో నిర్వహించేందుకు నిర్ణయించారు.
అధినేత గుస్సా !
మహానాడు నిర్వహణకు సంబంధించి గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యంగా వైఎస్సార్ హయాంలో కూడా ఇటువంటి ఆంక్షలేవీ ఎదుర్కొనే విధంగా లేవని, కానీ ఇప్పుడు పెద్దాయన కొడుకు ఈ విధంగా తనను అడ్డుకోవడం బాధగానే ఉందని జగన్- ను ఉద్దేశిస్తూ చంద్రబాబు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. మహానాడు నిర్వహణ పై వివిధ కమిటీలతో ఆయన ఆన్లైన్ లో ముచ్చటించాక
ఈ వ్యాఖ్యలు చేశారు. మినీ స్టేడియం అన్నది మీ తాత జాగీరా అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆవేశంతో ఊగిపోయారు. ఓ విధంగా సభ నిర్వహణకు మొండి చేయి చూపడంతో వైసీపీ పై చేయి సాధించింది. అనుకున్న ఫలితం సాధించింది. టీడీపీని ఏదో ఒకవిధంగా నిలువరించడం సాధ్యం అయిందని సంతృప్తి ఒకటి ఆ పార్టీ లో ఓ వర్గంలో కనిపిస్తోంది.
వచ్చే ఎన్నికల కథేంటి ?
వాస్తవానికి పెద్దాయన ఎన్టీఆర్-ను స్మరిస్తూ మహానాడు నిర్వహణ అన్నది చేస్తుంటారు. కానీ కరోనా కారణంగా గత రెండేళ్లుగా ఏవో అవాంతరాలు వస్తూనే ఉన్నాయి. దాంతో తప్పక ఆన్లైన్ లో మహానాడు నిర్వహించారు. వివిధ తీర్మానాలు ఆమోదించారు.ఈ సారి ఎన్నికలు సమీపిస్తున్న తరుణాన ఎటువంటి తీర్మానాలు ఉంటాయి. వేటిపై చర్చించనున్నారు అన్నవి ఇక ఆసక్తిదాయకంగా ఉన్నాయి. ఏదేమయినప్పటికీ టీడీపీకి ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్య అన్నది సుస్పష్టం అని పరిశీలకులు అంటున్నారు. కార్యకర్తలు బలోపేతం అయి పనిచేస్తే, అందుకు అనుగుణంగా మహానాడు తీర్మానాల ప్రభావం కూడా ఉంటే,
నాయకత్వ లోపం సరిదిద్దుకుంటే ఆశించిన ఫలితం రావడంతో పాటు పరువు నిలుపుకునే చర్యలు చేపట్టడడం సాధ్యం అవుతుంది…అని పార్టీ అభిమానులు అంటున్నారు.