పట్టులేని చోట కమలంలో రచ్చ..ఇంకా డ్యామేజే!

-

ఇప్పుడుప్పుడే తెలంగాణలో పట్టు సాధించే దిశగా బీజేపీ ముందుకెళుతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు రాష్ట్రంలో బీజేపీకి పెద్ద పట్టు దొరకలేదు. కానీ గత రెండేళ్ల నుంచి పరిస్తితి మారింది. తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. టీఆర్ఎస్‌కు గట్టి పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగింది. అయితే బీజేపీ ఇంకా పలు జిల్లాల్లో బలపడాలి. కొన్ని జిల్లాల్లోనే బీజేపీకి బలం కనిపిస్తుంది. మిగిలిన జిల్లాలపై అంత పట్టు ఉన్నట్లు కనిపించడం లేదు. ముఖ్యంగా నల్గొండ, ఖమ్మం, వరంగల్ లాంటి జిల్లాల్లో బీజేపీకి పట్టు కనిపించడం లేదు.

అయితే నల్గొండలో పట్టు పెంచుకునే దిశగా బీజేపీ ముందుకెళుతుంది. ఇటీవల ధాన్యం అంశంపై బండి సంజయ్ నల్గొండ జిల్లాలో పెద్ద ఎత్తున పోరాటం చేశారు. దీంతో బీజేపీకి మంచి ఊపు వచ్చింది. ఈ ఊపుని ఇలాగే కంటిన్యూ చేస్తే బీజేపీ ఇంకా ప్లస్ అవుతుంది. కానీ బీజేపీ మాత్రం ఆ దిశగా ముందుకెళ్లడం లేదు. అసలే నల్గొండలో బలం లేదు. పైగా ఇక్కడ నేతలు ఆధిపత్య పోరుతో మరింత దిగజారే పరిస్తితి వచ్చింది. కలిసికట్టుగా పనిచేయాల్సిన నేతలు..అంతర్గత కుమ్ములాటలతో పార్టీని మరింత ఇబ్బంది పెడుతున్నారు.

జిల్లాలో బలమైన క్యాడర్ లేకపోయినా సరే…బీజేపీలో మూడు గ్రూపులు నడుస్తున్నాయి. ప్రస్తుతం బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కంకణాల శ్రీధర్‌రెడ్డి తీరుపై పార్టీలోని మిగతా వర్గాలు గుర్రుగా ఉన్నాయి. ఇటీవల జిల్లా కార్యవర్గాన్ని ఏకపక్షంగా నియమించారని చెప్పి కంకణాలపై వేరే వర్గాలు ఫైర్ అయిపోతున్నాయి. అటు జిల్లా పార్టీ మాజీ అధ్యక్షుడు నూకల నర్సింహారెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్‌గౌడ్‌లు వేరు వేరు వర్గాలు నడుపుతున్నారు. జిల్లాలోని సమస్యలపై పార్టీ నిరసనలకు పిలుపిస్తే.. బీజేపీ నేతలంతా కలిసి పనిచేసిన పరిస్థితి లేదు. ఎవరి దారి వారిదే అన్నట్లు పరిస్తితి ఉంది. ఇటీవల పార్టీ కార్యకర్తల శిక్షణ శిబిరానికి ఈటల రాజేందర్ రావాల్సి ఉంది. కానీ పార్టీలోని గ్రూపు గొడవల వల్ల ఆయన ఆ కార్యక్రమానికి రాలేదని తెలిసింది. ఇలా పట్టు లేని చోట కమలం నేతలు అంతర్గత కుమ్ములాటలతో పార్టీకి మరింత డ్యామేజ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news