సాగర్ ఉపఎన్నికలో కుల సమీకరణాలు ఎంతవరకు కలిసొస్తాయ్‌ ?

-

సాగర్ ఉపఎన్నికలో కుల సమీకరణాలు ఎంతవరకు కలిసొస్తాయ్‌ ? మరోవైపు బీజేపీ నామమాత్రం గానే ప్రచారం చేస్తుంది.బండి సంజయ్ తోపాటు డీకే అరుణ సహా 30 మంది స్టార్ క్యాంపెయినర్లను నియమించింది. సాగర్‌ ఉప ఎన్నికల్లో కుల సమీకరణాల ఆధారంగానే టికెట్లు కేటాయించాయ్‌ రాజకీయ పార్టీలు. అయితే ఇవి ఎంతవరకు కలిసొస్తాయి..ఎన్ని ఓట్లు తెచ్చిపెడతాయి ప్రస్తుతం ఇవే లెక్కలేసుకుంటున్నాయి ప్రధాన రాజకీయ పార్టీలు.

నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో సామాజికవర్గ సమీకరణాలతోనే అభ్యర్థులను ప్రకటించాయి ప్రధాన పార్టీలు. నియోజకవర్గంలో మొత్తం 2,19,745 ఓట్లున్నాయి. ఇక్కడ గెలవాలంటే సుమారు 70,000 ఓట్లు పైగా సాధించాలి. రెడ్డి కులానికి కాంగ్రెస్ పార్టీ, యాదవ కులానికి టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ లంబాడ కులానికి టికెట్ ఇచ్చాయి. నోముల నర్సింహయ్య అకాల మరణంతో జరుగుతున్న ఉపఎన్నిక కావడం మరోవైపు యాదవ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండటంతో అభ్యర్థి ఎంపిక కోసం సర్వేలు, రీ సర్వేలు చేసి అభ్యర్దిని ఎంపిక చేసింది టీఆర్ఎస్.

టీఆర్‌ఎస్‌ నుంచి నోముల భగత్‌కు టికెట్‌ ఇవ్వడం వెనుక సిట్టింగ్‌ అంశం కన్నా కుల లెక్కలు ఆధారంగానే ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. టీఆర్‌ఎస్‌ యాదవ సామాజికవర్గం ఓట్లను నమ్ముకుని 2018 తోపాటు, ఇప్పుడు అదే సామాజికవర్గానికి చెందిన భగత్‌కు టికెట్ కేటాయించింది. నియోజకవర్గంలో యాదవుల ఓట్లు 36,646 ఉన్నాయి. మరి ఈ ఓట్లన్నీ టీఆర్‌ఎస్‌కు పడతాయాన్నది చర్చనీయాంశంగా మారింది. దీంతో ఇతర సామాజికవర్గానికి చెందిన ఓట్ల పై గురి పెట్టారు.

కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత జానారెడ్డి బరిలో ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గానికి 23 852 ఓట్లు ఉన్నాయి. రెడ్డి సామాజిక వర్గ ఓట్లతోపాటు, తన సుదీర్ఘ అనుభవం, పరిచయాలతో పాటు అన్ని సామాజికవర్గాల ఓట్లపై కన్నేశారు.. దుబ్బాక , గ్రేటర్ ఫలితాలతో దూకుడు మీద ఉన్న బీజేపీ సాగర్ లో సత్తా చాటేందుకు సర్వేల మీద సర్వేలు చేసి చివరి నిమిషం వరకు అభ్యర్ది పై సస్పెన్స్ కొనసాగించింది. చివరకు బీజేపీ ఎస్టీ అభ్యర్ధిని నిలబెట్టి, ఎస్టీలలో సానుభూతి సంపాదించి గంపగుత్తగా ఓట్లు పడేలా ప్రయత్నాలు చేస్తోంది. 34వేలకు పైగా ఓట్లు ఇక్కడ ఎస్టీ సామాజికవర్గానికి ఉండటంతో వారితో పాటు, ఇతర ఓట్లపై కూడా భారీగానే గురి పెట్టింది.

ఏది ఏమైనా నాగార్జునసాగర్‌లో ఎవరు గెలవాలన్నా ఒక్క సామాజికవర్గ ఓట్లు సరిపోకపోవడంతో ఇతర వర్గాల ఓట్లపై కన్నేశారు. మరి ఈ కుల సమీకరణాలు ఎంత వరకు కలిసొస్తాయో చూడాలి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news