తెలంగాణ నుంచే మోదీ పోటీ..నిజమెంత?

తెలంగాణలో కాషాయ జెండా ఎగరవేయాలని చెప్పి కమలం నేతలు గట్టిగా కష్టపడుతున్న విషయం తెలిసిందే. ఎలాగైనా నెక్స్ట్ కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించి అధికారంలోకి రావాలని బీజేపీ చూస్తుంది. ఆ దిశగానే బీజేపీ నేతలు పనిచేస్తున్నారు. ఎక్కడ తగ్గకుండా కమలం నేతలు దూకుడుగా పనిచేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అనేలా పోరాడుతున్నారు. అయితే కేంద్రం పెద్దలు కూడా తెలంగాణపై ఫుల్ గా ఫోకస్ పెట్టారు. రాష్ట్ర నేతలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి..వారికి సపోర్ట్ గా ఉంటున్నారు.

అయితే తెలంగాణలో గెలవడం కోసం కమలం పార్టీ రకరకాల వ్యూహాలతో ముందుకొస్తూ రాజకీయం చేస్తుంది. ఇదే సమయంలో తెలంగాణలో బీజేపీకి ఊపు వచ్చేలా ఓ సంచలన విషయం బయటకొచ్చింది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ నుంచే మోదీ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. తెలంగాణలో పార్టీని బలపరిచేందుకు, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపేందుకు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి మోదీ పోటీ చేస్తారనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది.

మహబూబ్ నగర్ లోక్‌సభ స్థానం నుంచి మోదీ పోటీ చేసే  అవకాశముందని ప్రచారం జరుగుతోంది. ఇక అక్కడ నుంచి పోటీ చేస్తే ఎలాంటి ప్రభావం ఉంటుందనే విషయంపై ఇప్పటికే ఒకసారి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సీక్రెట్ సర్వే చేయించినట్లు ప్రచారం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ ప్రచారాన్ని సమర్థించేలా దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తన అధికారిక యూబ్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ పెట్టారు.

అయితే మహబూబ్ నగర్‌లో బీజేపీకి కూడా బాగా బలం ఉంది. గతంలో 1999 ఎన్నికల్లో మహబూబ్‌నగర్ పార్ల‌మెంట్ స్థానం నుంచి బీజేపీ తరపున జితేందర్ రెడ్డి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 2012లో మహబూబ్ నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో బీజేపీ తరపున ఎన్నం శ్రీనివాస్ రెడ్డి విజయం సాధించారు. ఇక ఇవన్నీ ప్రచారం మాత్రమే..ఇందులో నిజమెంత ఉందనేది క్లారిటీ లేదు. పైగా పార్లమెంట్ ఎన్నికలకంటే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. అలాంటప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం ఉండదు. మరి ఈ ప్రచారం నిజమవుతుందో లేదో చూడాలి.