రాజకీయాల్లో ఏవీ స్థిరం కావు అన్న అయోగ్యమయిన మాట ఒకటి విని నవ్వుతూ పోవాలి. పైకి అస్థిరం కానీ లోపలంతా స్థిరమే కదండి ! కనుక నవ్వుతూ తుళ్లుతూ ప్రత్యేక పరిణామాల నేపథ్యంలో మనం అన్నీ చూస్తూ పోవాలి. రాజకీయంలో అన్నీ అస్థిరం అన్న మాట ఇప్పుడు అబద్ధం అన్నది ఓ రూఢీ ఇంకా చెప్పాలంటే ఓ నిర్థారణ. ఇంగ్లీషు వాడయితే కన్ఫర్మేషన్ అని అనమన్నాడు. ఏదో ఒక పదం మన జీవితాలను అస్తవ్యస్తం చేయకుండా ఉంటే మేలు. ఏదో ఒక నాయక గణం మనల్ని అధోగతిలో నెట్టకుండా ఉంటే చాలు.ఇవే ఇప్పటి కోరికలు మరియు కైవల్య మార్గాలు కూడా !
ఇప్పుడిక రోజా గారు ఏం మాట్లాడినా అది ఓ పెద్ద వింత. ఆమె ఏమి చెప్పినా కవిత్వం అయి ఉంటుంది. కవిత్వం కూడా టూరిజం శాఖకు పనికివచ్చే విషయమే కనుక ! ఆమె ఏం చెప్పినా ఆ ధారణను మనం చూసి విని ఆశ్చర్యపోయి వెళ్లాలి. నిన్నటి వేళ ఆమె రెండు కీలక సమావేశాలు నిర్వహించారు. సమావేశం అన్నది పెద్ద మాట కావొచ్చు కనుక వీటిని ఆత్మీయ భేటీలు అని రాయండి.ఆ విధంగా ఆ రెండు ఆత్మీయ భేటీలు కూడా అత్యంత ఆవశ్యకాలే ఆమెకు ! ఎందుకంటే ఒకటి రాజకీయం రీత్యా..రెండు సినిమా రీత్యా.. ఎలానో చూద్దాం.
తెలంగాణ ఫార్మేషన్ అన్నది కేసీఆర్ కల అయిన రోజుల్లో ఆయన్ను ఉద్దేశించి రాత్రి బారు.. పగలు దర్బారు అనే ఓ అద్దె డైలాగు పలికారు ఒకనాటి మేటి నటి రోజా.. నాయకురాలు రోజా సెల్వమణి. ఆ విధంగా ఆమె ఆ రోజు కేసీఆర్ సర్ ను కొన్ని అనరాని మాటలు అన్నారు. తరువాత ఎందుకనో ఇప్పుడు యాదగిరి గుట్టను ఆ వైభవాన్నీ పొగుడుతున్నారు. అదేవిధంగా మంత్రి అయిన వేళ నిన్న కేసీఆర్ సర్ ను కలిసి వచ్చారు. ఆయన ఆశీస్సులు తీసుకున్నారు.
ఆ కుటుంబం ఆమెను ఆడపడుచు మాదిరి గౌరవించి పంపింది. ఇదొక ఆసక్తికర పరిణామం. అలానే ఆమె కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను పెద్దగా పరిగణించకుండా కారు పోనివ్వండి అని డ్రైవర్ కు చెప్పి మీడియా మైకుల నుంచి తప్పుకున్నారు. ఆ విధంగా నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరగడంలో ఉన్న ధన్యతను ఆమె నిన్న పొంది ఉన్నారు. అందుకే ధన్యోస్మి రోజా గారూ అని విపక్షం పెదవి విరుపులు ప్రారంభించింది.
ఇక రెండో ఆత్మీయ భేటీ చిరు సర్ ను కలిశారు. దీనిని కూడా ఆత్మీయ భేటీ అనే రాయాలి. ఓవైపు వైసీపీ లీడర్ గా ఉన్న రోజా ఎప్పటికప్పుడు పవన్ ను తిడుతూ ఉంటారు. ఆయన అస్సలు పొలిటీషియన్ కానే కాదు అంటారు. మరోవైపు చిరు సర్ కుటుంబంలో తానొక సభ్యురాలినని చెబుతారు. ఆ విధంగా ఆమె రాజకీయంలో భాగంగా ఏం చెప్పినా ఆ పరిణితిని చూసి విస్తుబోవాలి. ఎందుకంటే రోజా అనే నాయకురాలి కారణంగానే ఎన్నో పరిణామాలు మారిపోయాయి చిత్తూరులో ! ఆఖరికి ఆమె శత్రువు అయిన పెద్దిరెడ్డి అనే పెద్దాయనకు పాదాభివందనాలు చేసేందుకు కూడా వెనుకాడలేదు.
ఆ విధంగా ఆమె ఎప్పటికి ఏది అవసరమో ఆ మేరకే ఉంటారు. ఆ మేరకే ప్రవర్తించి ఉంటారు. ఆ అవధిని అర్థం చేసుకోవడం చెరిపెయ్యడం ఎవ్వరి తరం కాదు. పై రెండు ఆత్మీయ సమావేశాల్లో ఆమె ఆత్మీయ సత్కారాలను ఆయా ప్రముఖుల నుంచి పొందారు. పరస్పర అభినందనలు,ప్రశంసలూ అన్నవి దక్కాక రోజా తన నగరికి చేరి ఉండాలి..ఉంటారు కూడా ! లేదా ఇంకా హైద్రాబాద్ నగరి పర్యటనలోనే ఉన్నారేమో.! ఏదేమయినా రాజకీయంలో ఏమో గుర్రం ఎగరావచ్చు అన్న మాట మాత్రం బాగుంటుంది వినేందుకు చూసేందుకు చూసి తరించేందుకు !