ప్రత్యేక హోదా…ఎప్పుడు బీజేపీ నేతలు చెప్పినట్లుగానీ…అది ముగిసిన అధ్యాయం అని అనుకోవచ్చు. ఎందుకంటే హోదా అనే విషయాన్ని రాజకీయ పార్టీలే కాదు ప్రజలు కూడా మర్చిపోయినట్లు ఉన్నారు. అసలు రాష్ట్ర విభజన జరిగాక కేంద్రం…హోదా ఇచ్చి ఏపీని ఆదుకుంటామని చెప్పింది. అప్పుడు కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ హామీ ఇచ్చింది. కానీ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ సైతం హోదా ఇస్తానని చెప్పింది. అలాగే ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకుంది.
కానీ అధికారంలోకి వచ్చాక హోదా ఇవ్వలేం..దాని బదులు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని చెప్పారు. దీనికి చంద్రబాబు కూడా ఒప్పుకున్నారు. కానీ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్ మాత్రం హోదా కోసం గట్టిగా పోరాడారు. మళ్ళీ 2019 ఎన్నికల ముందు చంద్రబాబు…బీజేపీ నుంచి బయటకొచ్చి హోదా కోసం పోరాటాలు చేశారు. ఇటు జగన్ ఏమో తనకు 25 ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రం మెడలు వంచి హోదా తెస్తానని అన్నారు. అలాగే జనం వైసీపీకి 22 ఎంపీలు ఇచ్చారు. కానీ కేంద్రంలో బీజేపీకి ఫుల్ మెజారిటీ వచ్చింది. దీంతో మొదట్లోనే జగన్ చేతులెత్తేశారు.
అప్పటి నుంచి జగన్ గానీ, చంద్రబాబు గానీ హోదా విషయంలో మాట్లాడలేదు. అసలు జగన్ మాత్రం హోదా విషయంలో ఏదో కేంద్రాన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు తప్ప గట్టిగా పోరాటం చేయడం లేదు. ఇటు బాబు కూడా జగన్‌పై పోరాటం చేస్తున్నారు గానీ…మోదీ ప్రభుత్వాన్ని నిలదీయలేకపోతున్నారు.
తాజాగా కూడా బాబు…తమ ఎంపీలతో రాజీనామా చేయిస్తానని, వైసీపీ ఎంపీలతో జగన్ రాజీనామా చేయించి హోదా కోసం పోరాటం చేయాలని అంటున్నారు. అంటే అప్పటిలో జగన్ కేంద్రంపై పోరాటం చేయకుండా చంద్రబాబుపై పొరటం చేశారు…ఇప్పుడు బాబు కూడా జగన్‌పై పోరాటం చేస్తున్నారు గానీ, మోదీ ప్రభుత్వాన్ని నిలదీయలేకపోతున్నారు. అంటే ఇక్కడ ఇద్దరు నేతలు హోదా కోసం పోలిటికల్ గేమ్ ఆడుతున్నారని అర్ధమవుతుంది.