కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఏ స్థాయిలో పోరాటం చేస్తున్నారో అందరికీ తెలిసిందే. కేంద్రంలో ఎలాగైనా మోదీ సర్కార్‌ని గద్దె దించడమే లక్ష్యంగా కేసీఆర్ ముందుకెళుతున్నారు. అలాగే జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేక పార్టీలకు చెందిన అధినేతలని కలుస్తున్నారు…బీజేపీకి వ్యతిరేకంగా ఒక కూటమిని ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తున్నారు. అలాగే ఏ సభలోనైనా, ప్రెస్ మీట్లోనైనా సరే కేసీఆర్ టార్గెట్ ఒకటే…అది బీజేపీపై విమర్శలు చేయడమే, బీజేపీ మతతత్వ పార్టీ అని, మోదీ వల్ల దేశం నాశనం అయిందని ఇలా అనేక రకాలుగా బీజేపీపై విమర్శలు చేస్తున్నారు.
ఎలాగైనా దేశ రాజకీయాల్లో చక్రం తిప్పి…మోదీ సర్కార్‌ని గద్దె దించాలనేది కేసీఆర్ ధ్యేయంగా ఉంది. ఇదే క్రమంలో జాతీయ పార్టీ పెట్టాలని కేసీఆర్ భావిస్తున్న విషయం తెలిసిందే…ఇప్పటికే జాతీయ పార్టీకి సంబంధించి కీలక ప్రకటన కూడా చేశారు. ఖచ్చితంగా పార్టీ పెడతానని చెప్పారు. కానీ ఆ పార్టీ ఏంటి? ఎప్పుడు పెడతారనేది మాత్రం చెప్పలేదు.
కానీ అతి త్వరలోనే పార్టీ ఉండబోతుందని టీఆర్ఎస్ అనుకూల మీడియాలో కథనం వచ్చింది. ఈ నెల 11న మాజీ సీఎం కుమారస్వామి హైదరాబాద్‌కు వస్తారని, ఆయనతో జాతీయ పార్టీ గురించి కేసీఆర్ చర్చలు చేస్తారని అంటుంది. ఆ తర్వాతే విధివిధానాలు ఖరారు చేసుకుని కేసీఆర్ హైదరాబాద్ వేదికగా జాతీయ పార్టీ ప్రకటన చేస్తారని చెబుతోంది. కేసీఆర్ సారథ్యంలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తి ఏర్పడుతుందని, అలాగే పార్టీ ఏర్పాటు అయ్యాకే పొత్తులు, ఫ్రంట్లు గురించి చర్చలు జరుగుతాయని కథనం వచ్చింది.
కేంద్రంలో మోదీ సర్కార్ దారుణంగా విఫలమైన నేపథ్యంలో… ఇక ఆలస్యం చేయడంలో అర్థం లేదని, వెంటనే జాతీయ రాజకీయాల్లోకి రావాలని వివిధ పార్టీల నాయకులు, మేధావులు వివిధ మార్గాల్లో కేసీఆర్‌పై ఒత్తిడి పెంచడం ప్రారంభించారని, కేసీఆర్‌ని దేశం పిలుస్తుందని టీఆర్ఎస్ అనుకూల మీడియా బాగానే హైలైట్ చేసింది. అయితే ఇంతకాలం బీజేపీపై పోరాటం చేయాలని, జాతీయ పార్టీ పెట్టాలని, ఇప్పటివరకు కేసీఆర్‌ని దేశం పిలవడం జరగలేదు గాని…ఎప్పుడైతే తెలంగాణలో బీజేపీ ఎదుగుతుందో..అప్పుడే కేసీఆర్‌ని దేశం పిలవడం వింతగానే ఉంది. అలాగే జాతీయ పార్టీ పెట్టడం ఈజీనే…కానీ దాన్ని నిలబెట్టడమే కష్టం. మరి జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి.