కేసినో హీట్: టార్గెట్ కొడాలి.. గుడివాడ బరిలో దిగిన రావి?

-

సంక్రాంతి మూడు రోజులు కోడి పుంజులు బరిలో కొట్లాడితే.. సంక్రాంతి పండగ అయిన వెంటనే వైసీపీ-టీడీపీ నేతలు బరిలో దిగి రాజకీయ యుద్ధం మొదలుపెట్టారు. పుంజులు మూడు రోజులే కొట్లాడాయి.. కానీ ఈ రాజకీయ పుంజులు రోజూ కొట్లాడుతూనే ఉన్నాయి. ఒకరిపై ఒకరు పైచేయి సాధించడానికి పాట్లు పడుతున్నాయి. ఇదే క్రమంలో కృష్ణా జిల్లా రాజకీయాల్లో సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా ఉండే గుడివాడలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఇంతకాలం కొడాలి నానికి ఎలా చెక్ పెట్టాలని చూస్తున్న తెలుగు తమ్ముళ్ళకు ఒక ఛాన్స్ దొరికింది.

అయితే కరోనా వచ్చి కొడాలి నాని హైదరాబాద్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. అయినా సరే గుడివాడలో నడపాల్సిన రాజకీయం నడిపేస్తున్నారు. అలాగే ఎప్పటిలాగానే సంక్రాంతి సంబరాలని కూడా ఘనంగానే నిర్వహించారు. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ వచ్చింది. గోవా కేసినోలను గుడివాడలో దించేశారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. అలాగే దీనిపై టీడీపీ అనుకూల మీడియా కూడా పలు కథనాలని ప్రచురించింది.

అమ్మాయిలతో హుషారెత్తించే నృత్యాలు, కేసినో టేబుళ్ల వద్ద గేమ్ నడిపించింది అమ్మాయిలే అని, ఈ వ్యవహారమంతా మంత్రి కొడాలి నానికి చెందిన కె కన్వెన్షన్ హాలులోనే జరిగిందని విమర్శలు వస్తున్నాయి. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కృష్ణా జిల్లాకు చెందిన టీడీపీ నేతలు.. జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అయితే దీనిపై వైసీపీ నుంచి ఎలాంటి కౌంటర్లు రాలేదు. ఒకవేళ కొడాలి నాని బయట ఉంటే.. ఈ పాటికి కౌంటర్లు ఇచ్చేవారేమో.

అదే సమయంలో గుడివాడ టీడీపీ ఇంచార్జ్ రావి వెంకటేశ్వరరావు.. ఒక్కసారిగా రంగంలోకి దిగారు. ఇంతకాలం బయటకు రాని రావి.. బయటకొచ్చి కేసినో గురించి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అలాగే దీనిని గుడివాడ ప్రజలే అడ్డుకోవాలని, దీని వల్ల యువత నాశనం అవుతుందని అన్నారు. ఇక రావి ఎంట్రీతో గుడివాడ రాజకీయాలు అనూహ్యంగా మారతాయని చెప్పొచ్చు. గుడివాడలో కొడాలి నాని, రావి వెంకటేశ్వరరావుల మధ్య రాజకీయ యుద్ధం గట్టిగానే జరిగేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news