కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. తుఫ్రాన్ మున్సిపల్ ఆఫీస్ లో హరీష్ రావు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. బిజెపి అంటే భారతీయ జూటా పార్టీ అని విమర్శించారు. అమిత్ షా కాదు అబద్ధాల బాద్ షా అని… మొన్న నడ్డా కుడా వచ్చి అబద్ధాల అడ్డా అని ప్రూవ్ చేసుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు హరీష్ రావు.
బిజెపిది అంతా ఫేక్ ప్రచారమని.. స్వయంగా ఫేక్ ప్రచారం చెయ్యండి అని గతంలో అమిత్ షానే చెప్పారని మండిపడ్డారు. అబద్దాలను సోషల్ మీడియాలో, వాట్సాప్ యూనివర్సిటీల్లో పబ్లిక్ గా అబద్దం చెప్పే పార్టీ బిజెపి అని ఆగ్రహించారు.
తెలంగాణ సర్కార్‌ని కేంద్రం ఇబ్బంది పెట్టాలని చూసిందని విమర్శలు చేశారు. అందుకే వడ్లు కోసమంటూ బిజెపి తొండాట ఆడిందని ఫైర్ అయ్యారు. కేంద్రం వడ్లు కొనమని చెబితే… రూ. 3 వేల కోట్ల నష్టాన్ని భరించి రైతులు పండించిన ప్రతి గింజను సీఎం కేసీఆర్ కొంటున్నారన్నారు. రైతులెవరు తక్కువ ధరకు పంటను అమ్ముకోవద్దని కోరారు మంత్రి హరీష్ రావు.