హైదరాబాద్ మెట్రో టికెట్ ధరల పెంపు పై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో మెట్రో ఛార్జీలు పెరగబోతున్నాయి అన్న వార్తలు నేపథ్యంలో అసెంబ్లీ వేదికగా మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో భాగంగా చివరి రోజు చర్చ జరుగుతోంది. జిహెచ్ఎంసిఅభివృద్ధి, మెట్రో పనుల అభివృద్ధిపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలో మెట్రో నూతన మార్గాల ఏర్పాటుకు కేంద్రం అడ్డు తలుగుతుందని విమర్శించారు. దేశంలో బిజెపి రూలింగ్ లో ఉన్న రాష్ట్రాలలో చిన్న చిన్న నగరాలకు సైతం మెట్రో రైలు మార్గాలకు నిధులు మంజూరు చేస్తున్నారని అన్నారు. కానీ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరానికి మాత్రం మొండి చేయి చూపుతోందని మండిపడ్డారు.
కేంద్రం తీసుకువచ్చిన మెట్రో యాక్ట్ ప్రకారం చార్జీల నిర్ణయాధికారం పూర్తిగా మెట్రో నిర్వహణ సంస్థకి కేంద్ర ప్రభుత్వం కట్టబెట్టిందని అన్నారు. అయితే ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో బాధ్యతలను చూస్తున్న ఎల్ అండ్ టి చార్జీల పెంపు దిశగా యోచిస్తోందని, అడ్డగోలుగా ధరల పెంపు ఉండకూడదని తాము ఎల్ అండ్ టి కి తగిన సూచనలు చేశామన్నారు.