శేరిలింగంపల్లి రేసు: తెలంగాణలో వైవిధ్యమైన నియోజకవర్గాల్లో శేరిలింగంపల్లి కూడా ఒకటి అని చెప్పవచ్చు. ఇక్కడ ఏపీ, తెలంగాణ ప్రజలే కాదు..ఇతర రాష్ట్రాల ప్రజలు ఎక్కువగానే ఉంటారు. ఐటీ ఉద్యోగాలు కోసం వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వారు ఎక్కువ. ఇక వారే రాజకీయంగా గెలుపోటములని శాసిస్తారు. అలాంటి స్థానంలో ఇప్పుడు రాజకీయంగా పట్టు సాధించేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. బాగా డిమాండ్ ఉన్న ఈ సీటు కోసం నేతలు ఎక్కువగానే పోటీ పడుతున్నారు. ప్రతి పార్టీలో ఈ పోటీ కనిపిస్తుంది.
ప్రస్తుతం బిఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఉన్న విషయం తెలిసిందే. 2014లో టిడిపి నుంచి, 2018లో బిఆర్‌ఎస్ నుంచి గెలిచిన గాంధీ..వచ్చే ఎన్నికల్లో కూడా పోటీ చేయాలని చూస్తున్నారు. అయితే బిఆర్‌ఎస్ సీటు దాదాపు ఈయనకే ఫిక్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ బిఆర్‌ఎస్ లో కొందరు ఆశావాహులు ఇంకా సీటు కోసం ట్రై చేస్తున్నారు. బిఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బండి రమేష్ సైతం శేరిలింగంపల్లి సీటు ఆశిస్తున్నారు.
అటు ఇటీవలే కర్నాటక ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ సైతం తెలంగాణలో రేసులోకి వచ్చింది. దీంతో అన్నీ ప్రాంతాల కలయికగా ఉన్న శేరిలింగంపల్లి సీటు కోసం కాంగ్రెస్ నేతలు పోటీ పడుతున్నారు. సత్యనారాయణతో పాటు జైపాల్ కాంగ్రెస్ సీటు ఆశిస్తున్నారు. ఇక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లోకి వస్తున్నారనే కథనాలతో..ఆయన అనుచరులు కొందరు ఈ సీటుపై కన్నేశారు.
ఇక బిజేపిలో కూడా పోటీ ఎక్కువగా ఉంది. మొవ్వా సత్యనారాయణ, నారబోయిన రవికుమార్ యాదవ్, గజ్జల యోగానంద్..ఇలా ముగ్గురు నేతలు సీటు కోసం పోటీ పడుతున్నారు. ఇక్కడ టిడిపి కూడా రేసులో ఉంది. ఇక్కడ టిడిపి మద్ధతు దారులు ఎక్కువగానే ఉన్నారు. కూన వెంకటేష్ గౌడ్ తనయుడు గౌరీ శంకర్ గౌడ్ ఈ సీటు ఆశిస్తున్నారు. మొత్తానికి ఈ సారి శేరిలింగంపల్లి సీటులో చతుర్ముఖ పోటీ జరిగేలా ఉంది.