సిద్ధిపేటలో ఎన్నికల వేడి రాజుకుంది. మున్సిపల్ ఎన్నికలతో అన్ని పార్టీలు ఊపిరి సలపని బిజీలో ఉన్నాయి. అయితే మున్సిపాలీటిలో పార్టీలకు రెబెల్స్ బెడద పట్టుకుంది. టీఆర్‌ఎస్‌లో పాత, కొత్త నేతల మధ్య పొసగకపొవడంతో భారీగా రెబల్ అభ్యర్ధులు నామినేషన్ వేశారు. సిద్దిపేటలో అన్నీ తానై నడిపచే హరీశ్ మాట సైతం రెబల్ అభ్యర్దులు లెక్క చేయడం లేదు. దాదాపు అన్ని వార్డుల్లో టీఆర్ఎస్ నుంచి రెబల్ అభ్యర్ధులు బరిలో నిలిచారు.
సిద్దిపేట ఇప్పటి వరకు మున్సిపాలిటీకి తొమ్మిదిసార్లు ఎన్నికలు జరిగాయి. 2010లో చుట్టుపక్కల గ్రామాలను విలీనం చేయడంతో మున్సిపాలిటీ పరిధి పెరిగింది. విలీనంపై కొందరు కోర్టుకు వెళ్లడంతో కొన్నాళ్లు ఎన్నికలు జరగలేదు. ప్రస్తుతం అన్నీ లైన్ క్లియర్ కావడంతో 43 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 2016లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 34 వార్డులకు గాను.. టీఆర్‌ఎస్ 25, బీజేపీ 2, స్వతంత్రులు 7 వార్డులు గెలుచుకున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ వేడి నెలకొనడంతో అన్ని పార్టీల నుంచి పోటీదారులు పెరిగారు. నోటిఫికేషన్ రాగానే భారీగా నామినేషన్లు వేసేశారు అభ్యర్థులు.
టీఆర్‌ఎస్ సహా అన్ని పార్టీలకు ఇప్పుడు రెబల్స్ బెడద పట్టుకుంది. టీఆర్‌ఎస్‌లో పాత, కొత్త నేతల మధ్య పొసగడం లేదట. 43 వార్డులు ఉండగా.. టీఆర్‌ఎస్ నుంచి 120, బీజేపీ నుంచి72 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్లు విత్‌డ్రా చేసుకోవడానికి బుధవారమే ఆఖరి రోజు. దీంతో అన్ని పార్టీల నాయకులు బరిలో ఉన్న రెబెల్స్‌ను బుజ్జగించే పనిలో పడ్డారు. ఏదైనా ఉంటే కూర్చుని మాట్లాడుకుందాం.. పోటీ నుంచి తప్పుకోవాలని కోరుతున్నారట. ఒకే పార్టీ నుంచి ఎక్కువ మంది పోటీ చేస్తే మొదటికే మోసం వస్తుందని.. జనాలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని నచ్చజెబుతున్నారట.
రెబెల్స్‌గా ఉన్నవారు ఎంతమంది మనసు మార్చుకుంటారు.. ఎంత మంది పోటీలో ఉంటారు అన్నది ఉత్కంఠ రేపుతోంది. టీఆర్ఎస్ లో చాలా మంది పోటీ నుంచి తప్పుకోవడానికి ససేమిరా అంటున్నారట. ఇన్నాళ్లూ పార్టీ కోసం కష్టపడ్డామని కొందరు.. పార్టీ చెప్పడం వల్లే బరిలో ఉన్నామని మరికొందరు ఎదురు వాదిస్తున్నారట. దీంతో కేడర్‌కు సైతం ఏం చేయాలో పాలుపోవడం లేదని సమాచారం. రెబెల్స్ బెడద తప్పించేందుకు టీఆర్‌ఎస్ నేత హరీశ్ ఏ మంత్రం వేస్తారో.. ఎంతమందిని దారికి తెచ్చుకుంటారో చూడాలి.