అగ్నిపథ్ ఆందోళనలు.. పరీక్షలు రద్దు కావడంతో యువకుడు ఆత్మహత్య!

కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా అల్లర్లు జరుగుతున్నాయి. అయితే ఈ పథకం ప్రవేశపెట్టిన తర్వాత ఆర్మీ రిక్రూట్‌మెంట్ కోసం లిఖిత పరీక్షను రద్దు చేసింది. దీంతో మనస్థాపానికి గురైన ఒడిశా యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భారత సైన్యంలో చేరాలని తన కుమారుడి కల అని, అది నెరవేరకపోవడంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు యువకుడి తండ్రి ఆరోపించాడు.

యువకుడు ఆత్మహత్య
యువకుడు ఆత్మహత్య

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రం బాలాసోర్ జిల్లాలోని టెనెటి గ్రామానికి చెందిన ధనంజయ్ మహంతి.. భారత సైన్యంలో చేరాలని కఠోర శిక్షణ పొందాడు. అయితే అగ్నిపథ్ పథకాన్ని ప్రకటించిన క్రమంలో అధికారులు లిఖిత పరీక్షను రద్దు చేశారు. దీంతో మనస్థాపానికి గురైన ధనంజయ్ ఆత్మహత్య చేసుకున్నాడు. గత నాలుగేళ్లుగా ఆర్మీలో చేరాలని శిక్షణ పొందుతున్నాడని, ఏడాదిన్నర కిందటే ఫిజికల్ ఫిట్‌నెస్ పరీక్ష కూడా పూర్తి చేశాడని ధనంజయ్ స్నేహితుడు పితబస్ రాజ్ తెలిపారు. కోవిడ్ కారణంగా పలుమార్లు పరీక్ష వాయిదా పడిందని, తాజాగా అగ్నిపథ్ స్కీమ్ ద్వారా రాత పరీక్ష రద్దు అవ్వడంతో ఇలా జరిగిందని పితబస్ రాజ్ ఆవేదన వ్యక్తం చేశాడు. వయసు పెరగడంతో మనస్థాపానికి గురై.. ధనంజయ్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.