తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర ఇవాళ 203వ రోజుకు చేరుకుంది. పాదయాత్రలో భాగంగా చెన్నూరు నియోజక వర్గం భీమారం మండల కేంద్రానికి చేరుకున్న షర్మిల బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల ముందు తన వద్ద వంద రూపాయలు కూడా లేవని చెప్పిన బాల్క సుమన్ కు ఇప్పుడు వందల కోట్లు ఎలా వచ్చాయని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ఎమ్మెల్యే బాల్క సుమన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డ షర్మిల.. తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లు ఎమ్మెల్యే కాస్త రౌడీ సుమన్ అయ్యాడన్నారు.
బాల్క సుమన్ చేసేది మొత్తం రౌడీయిజమేనని ఆరోపించారు. ఎన్నికల్లో ఈ బాల్క సుమన్ ను కేసీఆర్ నా కొడుకు అని అన్నాడు. ఏవైనా సరే కొట్లాడి సాధించుకోగలడు అని కేసీఅర్ అన్నాడట.. బాల్క సుమన్ కేసీఆర్ కు కొడుకు అయితే సిరిసిల్ల ఎలా ఉంది…? చెన్నూరు ఎలా ఉంది..? అని ప్రశ్నించారు వైఎస్ షర్మిల. తనను కొడుకు అన్నందుకు బాల్క సుమన్ కేసీఅర్ మీద, కేటీఆర్ మీద ఈగ కూడా వాలనివ్వడని అంటున్నాడట అని విమర్శించారు వైఎస్ షర్మిల.