సంవత్సర ఫలాలు
కొన్ని ప్రదేశములలో అల్ప మేఘములు, సస్యహాని, దుర్భిక్షము కలుగును. మరికొన్ని ప్రదేశములందు పైత్యరోగ పీడలు, అధిక వర్షములు, వరదలు, కలరా వ్యాధి వంటివి ప్రబలును. వర్షాధిక్యంతో పంటలు నశించును. దుర్భిక్ష భీతి యుండును. సంవత్సరాధిపతి చంద్రుని ఫలం ఆహార ధాన్యముల ధరలు బాగా పెరుగును. సమస్త వస్తువుల ధరలు పెరిగి నిలిచి యుండును. చెత్రం, వైశాఖం, జ్యేష్ట మాసములందు ధాన్యాదుల ధరలు పెరుగును. ఆషాఢ శ్రావణములందు అధిక వర్షములు ఉండును, భాద్రపద ఆశ్వీయుజ మాసములందు స్వల్ప వర్షము, వర్షాభావం వల్ల రోగ పీడలు, మాఘ ఫాల్గుణ మాసములందు ధాన్యాదుల ధరలు పెరుగును.
ప్రధాన గ్రహాల సంచారం ఏ రాశుల్లో సంచరిస్తున్నాయంటే…?
గురు సంచారము : గత సంవత్సర ఫాల్గుణ కృష్ణ నవమి శుక్రవారం 29-03-2019 రోజున సాయంత్రం గం. 07-42 ని.ల నుండి శ్రీ వికారి నామ సంవత్సర చైత్ర కృష్ణ తదియ సోమవారం 22-04-2019 వరకు అతిచారము వలన వృశ్చిక రాశి నుండి ధనుస్సు రాశి యందు సంచారము. తిరిగి శ్రీ వికారి నామ సంవత్సర చైత్ర కృష్ణ తదియ సోమ-వారం 22-04-2019 రా. 1-09 ని.ల నుండి వక్రగత్యా ధనుస్సు రాశి నుండి వృశ్చికరాశి యందు సంచారము. తిరిగి శ్రీ వికారి నామ సంవత్సర కార్తీక శుక్ల అష్టమి సోమవారం 05-11-2019 రా.తె. 5-17 ని.లకు గురు వృశ్చిక రాశి నుండి ధనుస్సు రాశి యందు ప్రవేశించి సంవత్సరాంతము ధనుస్సురాశి యందు సంచారము.
శని సంచారము: శ్రీ వికారి నామ సంవత్సరాది నుండి పౌష్య కృష్ణ అమావాస్య శుక్రవారం తేది 24-01-2020 ఉదయం 09-59 ని.ల వరకు శని ధనుస్సు రాశి యందు సంచారము. తదాది అనగా తేది 24-01-2010 శుక్రవారం ఉ. 09-59 ని.ల నుండి శని మకర రాశి యందు సంచారము.
రాహువు – కేతువుల సంచారము : గత సంవత్సర ఫాల్గుణ కృష్ణ తదియ తేది 23-03-2019 శనివారం రోజున ప. 12-35 ని.లకు కర్కాటక రాశి నుండి మిథున రాశి యందు రాహువు, మకర రాశి నుండి ధనుస్సు రాశి యందు కేతువుల ప్రవేశము. తేది 23-03-2019 శనివారం నుండి సంవత్సరాంతం మిథునరాశి యందు రాహువు, ధనుస్సు రాశి యందు కేతువుల సంచారము.
కర్తరీ, మౌఢ్యమి ఎప్పుడో మీకు తెలుసా…?
వాస్తుకర్తరీ: శ్రీ వికారి నామ సంవత్సరం చైత్ర కృష్ణ అమావాస్య శనివారం 04/05-05-2019 రోజున రాత్రి 02-48 ని.ల నుండి వైశాఖ కృష్ణ దశమి బుధ-వారం 29-05-2019 రోజున ఉదయం 07-45 ని.ల వరకు వాస్తు విషయ నిషిద్ధ వాస్తుకర్తరి.
శుక్ర మౌఢ్యమి: శ్రీ వికారి నామ సంవత్సర ఆషాఢ శుక్ల నవమి బుధవారం 08-07-2019 రోజున సాయంత్రం 5-20 ని.ల నుండి భాద్రపద కృష్ణ షష్టి శుక్రవారం 20-09-2019 రోజున పగలు 3-09 ని.ల వరకు శుక్ర మౌఢ్యమి.
గురు మౌఢ్యమి : శ్రీ వికారి నామ సంవత్సర మార్గశిర కృష్ణ పాడ్యమి శుక్రవారం 13-12-2019 రోజున రాత్రి 10-43 ని.ల నుండి 10-01-2020 రోజున రాత్రి 1-26 ని.ల వరకు పశ్చిమాస్తం గురు-మౌఢ్యమి. కనుక ఈ సమయములలో వివాహాది శుభకార్యములు నిషిద్ధము.
శ్రీ వికారి నామ సంవత్సరంలో మీ రాశి ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఈ క్రింది వాటిని క్లిక్ చేయండి..











