జానారెడ్డి ప్యూహం పై కాంగ్రెస్ లో ఆసక్తికర చర్చ

-

నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక పై ఏ చర్చ జరిగినా అందులో జానారెడ్డి పైనే కీలక చర్చ జరుగుతుంది. సాగర్ ఉపఎన్నికకు సిద్ధమవుతున్న వేళ జానారెడ్డి కామెంట్స్ ఇప్పుడు ఆసక్తి రేపుతున్నాయి. ఒక్కో పార్టీ గ్రామాలు,మండలాల వారీగా ఇంచార్జ్ లతో బై ఎలక్షన్ లు అనగానే హీట్ పుట్టిస్తాయి. అయితే జానారెడ్డి మాత్రం సింగిల్ హ్యాండ్ తో ఉప ఎన్నిక లీడ్ చేస్తానంటూ ప్రత్యర్ధులతో పాటు సొంతపార్టీ నేతలకు గట్టి మెసేజ్ పంపాడు.

ఉపఎన్నికల్లో రాజకీయ పార్టీలు తమ బలాన్ని, బలగాన్ని ప్రదర్శించడానికి ఫోకస్‌ పెడతాయి. తెలంగాణలో ఇప్పటి వరకు జరిగిన ఉపఎన్నికల్లో ఇదే సీన్‌ కనిపించింది. శక్తులన్నీ ఉపఎన్నిక జరిగే ప్రాంతంలోనే మోహరించాయి. ఇటీవల జరిగిన దుబ్బాక ఉపఎన్నికలో అదే జరిగింది. గ్రామాల వారీగా ఇంఛార్జులను పెట్టుకుని ఎన్నికల వ్యూహం రచించాయి. AICC రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ మాణిక్యం ఠాగూర్‌ అయితే గ్రామానికి, మండలానికో సీనియర్ కాంగ్రెస్‌ నేతను ఇంఛార్జ్‌గా బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు సాగర్‌లో ప్రధాన పార్టీల వ్యూహం ఎలా ఉంటుందో అని అనుకుంటున్న సమయంలో ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్న జానారెడ్డి చేసిన ప్రకటన కాంగ్రెస్‌ వర్గాలను ఆశ్చర్యపరిచింది.

నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక ఇప్పుడు కాంగ్రెస్‌కి చావో రేవో లాంటి సమస్యే. ఒకవైపు వరస ఓటములు నిరాశ పరిచినా.. ఇక్కడ మాత్రం జానారెడ్డిని ఒప్పించింది కాంగ్రెస్‌ పార్టీ. హైకమాండ్‌ పెద్దలు.. రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు ఒక విధంగా ఆయన పోటీ చేసేలా బ్రెయిన్‌ వాష్‌ చేశారనే చెప్పాలి. పార్టీలోని సీనియర్ నాయకులు కూడా ఎవరికి వారుగా సాగర్‌లో మండలాల వారీగా బాధ్యతలు తీసుకోవాలని నిర్ణయించారట. పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ ఎలాగూ అక్కడే ఉండాలి. ఆయన లోక్‌సభ పరిధిలోనే సాగర్‌ ఉంది. కోమటిరెడ్డి బ్రదర్స్‌లో ఎంపీ వెంకటరెడ్డి ఒక్కరే జానారెడ్డి కోసం పనిచేయాలని డిసైడ్‌ అయ్యారట. రేవంత్‌ కూడా ప్రచారం చేయాలని లెక్కలేశారు.
ఇలా కీలక నాయకులు వచ్చి ప్రచారం చేస్తే ఇబ్బంది లేదు. కానీ.. దుబ్బాక తరహాలో గ్రామనికో నాయకుడు అవసరం లేదని జానారెడ్డి ఫిక్స్ అయ్యారట. వచ్చే వాళ్లను వద్దనను కానీ.. దుబ్బాక మాదిరిగా నాయకుల మోహరింపు అవసరం లేదన్నది ఆయన వాదనగా ఉంది. అన్నీ తానై నడిపించుకోవాలని చూస్తున్నారట. స్వయంగా గ్రామాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు కూడా. సామాజిక వర్గాల వారీగా మీటింగ్‌లు పెడుతున్నారు. ఉపఎన్నికలో తాను గెలవాల్సిన ఆవశ్యకత ఎంటన్నది నియోజకవర్గం అంతా చెప్పుకున్నారు ఈ మాజీ మంత్రి.

జానారెడ్డి కుమారుడు రఘువీర్‌ రెడ్డి ఉపఎన్నిక ప్రచారం రూట్ మ్యాప్‌ సిద్ధం చేస్తున్నారట. ఆయనే ప్రచారానికి వచ్చే నాయకులను కోఆర్డినేట్‌ చేస్తారని సమాచారం. ఇదంతా తెలుసుకున్న పార్టీ నాయకులు జానారెడ్డి ప్యూహం పై ఆసక్తిగా చర్చించుకుంటున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news