ఎడిట్ నోట్ : విశాఖకు శుభ‌వార్త .. !

-

సుంద‌ర విశాఖ‌ను ఐటీ హ‌బ్ కు కేరాఫ్ గా మార్చాల‌న్న‌ది ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఆశ‌యం. ఆయ‌న ఆశ‌యానికి అనుగుణంగా ఇక్క‌డ కొన్ని దిగ్గ‌జ సంస్థ‌ల రాక‌తో కొన్ని యూనిట్ల ఏర్పాటుతో వేల మంది ఉపాధి క‌ల్ప‌న అన్న‌ది త్వ‌ర‌లోనే సాధ్యం కానుంది. విశాఖ‌లో ఇప్ప‌టికే అనేక ఫార్మా కంపెనీలు ప‌ర‌వాడ కేంద్రంగా ఏర్పాటు అయి ఉన్నాయి. అవ‌న్నీ  కాలుష్య సంబంధం అయిన‌వి. కాలుష్య ర‌హిత యూనిట్లను నెల‌కొల్పేందుకు, మాన‌వ వ‌నరుల వినియోగం మ‌రియు కొత్త అవ‌కాశాల సృష్టి కోసం ఎప్ప‌టి నుంచో ప్ర‌య‌త్నిస్తున్న జ‌గ‌న్ కు ఓ విధంగా ఇన్ఫోసిస్ అనే దిగ్గ‌జ కార్పొరేట్ సంస్థ అండ‌గా నిలిచింది. అదేవిధంగా మ‌రో కార్పొరేట్ సంస్థ అదానీ గ్రూపు కూడా సిద్ధంగానే ఉంది. ఆ వివ‌రం ఈ కథ‌నంలో …

ఇప్ప‌టిదాకా ఎన్నో ప‌రిశ్ర‌మ‌ల‌కు, పారిశ్రామిక  మార్పుల‌కు నెల‌వు అయిన విశాఖ‌లో మ‌రో మంచి ప‌రిణామం చోటు చేసుకోనుంది. సుందర తీరాన ప్ర‌ముఖ కార్పొరేట్ దిగ్గ‌జం ఇన్ఫోసిస్ రానుంది. ఇందుకు సంబంధించి ఇప్ప‌టికే రాష్ట్ర  ప్ర‌భుత్వంతో సంబంధిత కంపెనీ ప్ర‌తినిధులు చ‌ర్చ‌లు జ‌రిపారు. మొద‌ట వెయ్యి సీట్ల‌తో ఇక్క‌డి క్యాంప‌స్ ప్రారంభం కానుంది. అటుపై దీనిని మూడు వేల సీట్ల‌కు పెంచే అవ‌కాశాలున్నాయి అని సంబంధిత వ‌ర్గాల‌తో పాటు ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ ధ్రువీక‌రిస్తున్నారు.

ఎప్ప‌టి నుంచి విశాఖను ఐటీ హ‌బ్ గా చేయాల‌న్న యువ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా అడుగులు ప‌డుతున్నాయి. ఇన్ఫోసిస్ లాంటి దిగ్గ‌జ సంస్థ‌లు వ‌స్తే  ఉపాధి అవ‌కాశాలు మెరుగుప‌డ‌డంతో పాటు, ప్ర‌తిభావంతుల‌కు స‌మున్న‌త స్థానాలు ద‌క్క‌డం కూడా ఖాయం.

సుమారు ల‌క్ష చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణాన ఏర్పాట‌య్యే ఈ యూనిట్ కోసం విశాఖ, మ‌ధురవాడకు స‌మీపాన ఉన్న భ‌వంతుల‌ను ప‌రిశీలిస్తున్నారు. సంస్థ త‌న కార్య‌క‌లాపాలు ప్రారంభించి, నిలదొక్కుకున్న అనంత‌రం సొంత భ‌వ‌నాల నిర్మాణంపై దృష్టి సారించ‌నుంది. ఐటీ రాజ‌ధానిగా విశాఖ ఎద‌గడానికి అన్ని ర‌కాల అవ‌కాశాలూ ఉన్నాయ‌ని, ఇన్ఫోసిస్ రాకతో మ‌రిన్ని దిగ్గ‌జ సంస్థ‌లు ఇటుగా రానున్నాయ‌న్న ఆశాభావం మంత్రి గుర్నాథ్ వ్య‌క్తం చేశారు. వాస్త‌వానికి అంత‌ర్జాతీయ సంస్థ‌ల్లో ప‌నిచేసే ఐటీ నిపుణుల్లో ఇర‌వై ఐదు శాతం తెలుగువారేన‌ని, ఇక్కడ యూనిట్లు నెల‌కొల్పే వారికి పూర్తి స‌హ‌కారం అందిస్తామ‌ని అన్నారు.

ఇప్ప‌టికే మ‌ధుర‌వాడ స‌మీపాన 14 వేల 500 కోట్ల రూపాయ‌ల‌తో అదానీ సంస్థ‌లు ఇంటిగ్రేటెడ్ డేటా సెంట‌ర్ ఏర్పాటుకు స‌న్నాహాలు చేస్తున్నాయ‌ని చెప్పారు. త్వ‌రలో సంబంధిత ప‌నులను ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రారంభించ‌నున్నారు అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news